ముచ్చటగా మూడోసారి.. ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా

by Disha Web Desk 12 |
ముచ్చటగా మూడోసారి.. ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ చరిత్రలోనే మేయ‌ర్ ఎన్నిక ముచ్చటగా మూడోసారి వాయిదా ప‌డింది. మేయర్ ఎన్నికల ఫలితాలు విడుదలై రెండు నెలలు కావస్తున్నా మేయ‌ర్‌ను ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ మూడోసారి ఢిల్లీ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు స‌మావేశం అయ్యారు. అయితే ఓటింగ్ హ‌క్కుల అంశంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళ‌న చేప‌ట్టింది. దీంతో మేయ‌ర్ ఎన్నిక‌ను మ‌రోసారి వాయిదా వేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా నామినేట్‌ చేసిన పది మంది కౌన్సిలర్లను..మేయర్‌ ఓటింగ్‌కు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్యశర్మ అనుమతించారు. దీంతో సోమవారం హౌజ్‌ ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది.

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ ప్రకారం నామినేట్‌ సభ్యులుగానీ, పెద్దల కోటాలో ఎన్నికైన సభ్యులు గానీ మేయర్‌ ఎన్నికలో ఓటేయడానికి వీల్లేదు. కానీ, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ మాత్రం ఎల్జీ నామినేట్‌ చేసిన పది మందిని ఓటింగ్‌కు అనుమతించడం ద్వారా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆప్‌ సభ్యులు మండిపడ్డారు. ఈ తరుణంలో ఆప్‌, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట, పోటాపోటీ నినాదాలతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు. కాగా, ఈ అంశంపై ఆప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 15 ఏళ్ల త‌ర్వాత బీజేపీ త‌న ఆధిప‌త్యాన్ని కోల్పోయిన విష‌యం తెలిసిందే.


Next Story