ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు: ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు

by GSrikanth |
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు: ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సోమవారం సాయంత్రం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్​కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. గురువారం (నవంబర్ 2న) తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సమన్ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ఆప్ మంత్రులను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్​‌కు నోటీసులు పంపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ కావడం గమనార్హం. ఢిల్లీ కార్యాలయంలోని దర్యాప్తు అధికారి ఎదుట హాజరైతే ఆప్ చీఫ్ స్టేట్​మెంట్​ను రికార్డు చేస్తామని ఈడీ వెల్లడించింది. ‘‘ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను అంతం చేసే కుట్రతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోంది. కేజ్రీవాల్​పై తప్పుడు కేసు పెట్టడానికి అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ కేంద్ర ప్రభుత్వం వదలి పెట్టడం లేదు. ఆప్​ను పూర్తిగా అంతం చేయాలనేదే బీజేపీ కిలక్ష్యంగా మారింది ’’’ అని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంతసేపు ?

2021 నవంబరులో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం, ఆనాటి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా ఎదుర్కొన్నారు. దీంతో 2022 జూలైలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని కేజ్రీవాల్ రద్దు చేశారు. లిక్కర్ స్కాం కేసులో 2022 ఆగస్టు 17న సీబీఐ ఒక ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది.అయితే అందులో నిందితుడిగా కేజ్రీవాల్ పేరును చేర్చలేదు. ఇక ఈ కేసులో చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారణకు పిలిచింది.

ఆ సందర్భంగా సీబీఐ అధికారులు ఢిల్లీ సీఎంను 56 ప్రశ్నలు అడిగారు. ఆ రోజున ఉదయం 11.05 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈ కేసులో 2022 సెప్టెంబరులో ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్ అరెస్ట్ కాగా, 2023 ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే వ్యవహారంతో లింకులు ఉన్నాయనే అభియోగాలతో ఈ నెల ప్రారంభంలోనే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్టు చేశారు.Next Story

Most Viewed