అమెరికాకు నిఖిల్‌ను అప్పగించండి.. చెక్ కోర్టు సంచలన తీర్పు

by Hajipasha |
అమెరికాకు నిఖిల్‌ను అప్పగించండి.. చెక్ కోర్టు సంచలన తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో తలదాచుకుంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భారతీయుడు నిఖిల్‌ గుప్తా ప్రస్తుతం చెక్‌ రిపబ్లిక్ దేశంలోని జైలులో ఉన్నాడు. తనను అమెరికాకు అప్పగించవద్దంటూ అతడు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను చెక్‌ రిపబ్లిక్ రాజ్యాంగ కోర్టు కొట్టివేసింది. నిఖిల్‌ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ఇక ఈ అంశంపై చెక్ రిపబ్లిక్ న్యాయశాఖ మంత్రి పావెల్‌ బ్లాజెక్‌ తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. దిగువ కోర్టు తీర్పుపై అభ్యంతరం తెలుపుతూ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను చెక్‌ రిపబ్లిక్ రాజ్యాంగ కోర్టు తోసిపుచ్చింది. ఆ తీర్పు రాజకీయ ప్రేరేపితమైందనే అతడి వాదనను ఖండించింది. ‘‘నిఖిల్ అప్పగింత వల్ల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని న్యాయస్థానం భావించడం లేదు’’ అని తీర్పులో న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గతేడాది జూన్‌ 30న చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో అడుగుపెట్టిన వెంటనే నిఖిల్‌ గుప్తాను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు గుప్తా కుట్ర పన్నినట్లు ఆరోపణలు మోపారు. భారత అధికారుల సూచనల మేరకు పన్నూ హత్యకు కొందరు కిరాయి హంతకులను నియమించేందుకు నిఖిల్‌ గుప్తా ప్రయత్నించాడన్నది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంలో అమెరికాకు సహకరించేందుకుగానూ భారత్‌ కూడా ఈ అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.

Next Story

Most Viewed