లంచమిస్తే జాబ్ రాదు.. జైలుకే పోతారు : ఉప రాష్ట్రపతి

by Dishanational4 |
లంచమిస్తే జాబ్ రాదు.. జైలుకే పోతారు : ఉప రాష్ట్రపతి
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టును పొందడానికి లంచం ఇక పాస్‌వర్డ్‌గా పనికి రాదని.. అది జైలుకు వెళ్లే మార్గాన్ని మాత్రమే చూపిస్తుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అన్నారు. ప్రభుత్వ విభాగాలలోని అవినీతిని పారదోలిన ఘనత కేంద్ర సర్కారుకే దక్కుతుందని ఆయన చెప్పారు. అవినీతి ఇకపై పరిపాలనా వ్యవస్థను నిర్దేశించలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) 76వ బ్యాచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి ప్రసంగించారు. ‘‘భారతదేశం ఇకపై నిద్రపోతున్న దిగ్గజం కాదు. ప్రపంచ శక్తిగా మారే దిశగా వేగంగా దూసుకుపోతున్న మహా దిగ్గజం’’ అని అన్నారు. అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు చేతిలో నగదు ఉంచుకునే అలవాటును తగ్గించుకోవడంపై జగదీప్ ధన్‌ఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశం ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి. 1991లో కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ పారిస్, లండన్ వంటి నగరాల కంటే చిన్నది. ఇప్పుడు భారత్ పురోగమిస్తోంది. ఇంకో రెండేళ్లలో మన దేశ ఆర్థిక వ్యవస్థ జపాన్, జర్మనీలను దాటేసినా ఆశ్చర్యం లేదు’’ అని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.



Next Story

Most Viewed