బీజేపీ చేతికి కాంగ్రెస్ ఆయుధాలు.. తేరుకోకుంటే పార్టీ పరిస్థితి తెల్లారినట్టే?

by Disha Web Desk |
బీజేపీ చేతికి కాంగ్రెస్ ఆయుధాలు.. తేరుకోకుంటే పార్టీ పరిస్థితి తెల్లారినట్టే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : 'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' అన్న చందంగా తయారైంది హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి. నరేంద్ర మోడీ, అమిత్ షా గాలికి ఎదురీది పార్టీని అధికారంలోకి తీసువచ్చుకున్న ఆ పార్టీ నేతలు తాజాగా సీఎం పదవి కోసం ఆధిపత్య పోరుకు దిగడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్నటి ఫలితాల్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను 40 సీట్లను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో కొత్త పంచాయతీ మొదలైంది. దీంతో సీఎం పదవి ఖరారు నిమిత్తం ఆ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపేందుకు అధిష్టానం పంపించిన దూతనే అడ్డుకోవడం తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్య పార్టీ గెలుచుకోవడంతో ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి హిమాచల్ ప్రదేశ్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఓ టీమ్ ను పంపించింది. ఆ టీమ్ లో ఒకరైన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఒకరు. శుక్రవారం ఆయన సిమ్లాలోని ఒబెరాయ్ సిసిల్ హోటల్ కు వస్తుండగా ఆయన కారును హిమాచల్ ప్రదేస్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ మద్దతుదారులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి పదవిని ప్రతిభా సింగ్ కే ఇవ్వాలని నినాదాలు చేశారు.

ఈ ఎన్నికల్లో అసలు పోటీనే చేయని ప్రతిభా సింగ్ సీఎం పోస్ట్ ను ఆశించడం ఆ పార్టీలో సంచలనం రేపుతోంది. ఎన్నికల్లో పార్టీ భారీ విజయం తర్వాత శుక్రవారం మీడియాతో మాట్లాడిన ప్రతిభా సింగ్ గత సంవత్సరం మరణించిన తన భర్త వీరభద్ర సింగ్ పేరు మీద ఎన్నికలు పోరాడి గెలిచిన విషయాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించారు. ఎన్నికలకు ముందు పార్టీని నడిపించే బాధ్యతను సోనియా, హైకమాండ్ నాకు అప్పగించినందున నేను ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించగలనని భావిస్తున్నాను అంటూ ఆమె చేసిన కామెంట్స్ పార్టీలో దుమారం రేపాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఆమె ఇప్పుడు సీఎం పీఠంపై కన్నేయడం చర్చకు దారి తీసింది. తమ పార్టీలో గ్రూపిజం లేదని తమ ఎమ్మెల్యేలు అందరూ మాతోనే ఉన్నారంటూనే ముఖ్యమంత్రిగా తానే కావాలనుకుంటున్నానే సంకేతాలు పంపడం దుమారం రేపుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు చూసిన ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చిందనే చర్చ జరుగుతోంది. అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఓ వైపు ఏ మాత్రం అవకాశం లభించినా అధికారాన్ని తన వైపు లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో కుమ్మలాటలు తమ ప్రత్యర్థి బీజేపీ చేతికి ఆయుధం అప్పగించడమే అనే చర్చ జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న ఆధిపత్య పరిణామాలకు ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పెడితే అంత మంచిదని లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించినా స్థిరత్వం రావడం లేదనే సందేశం మిగతా రాష్ట్రాలకు వ్యాపిస్తే అది మొదటికే మోసం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో అన్ని తానై వ్యవహరించిన ప్రియాంక గాంధీ ఈ వ్యవహారాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.


Next Story