పాటియాలా జైలు నుంచి సిద్దూ విడుదల

by Dishafeatures2 |
పాటియాలా జైలు నుంచి సిద్దూ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: పార్కింగ్ విషయంలో తలెత్తిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో 10 నెలల పాటు జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వెటరన్ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ పాటియాలా జైలు నుంచి ఇవాళ విడుదలయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు జైలు వద్ద ఆయనను కలిశారు. కాగా జైలు నుంచి విడుదలైన అనంతరం సిద్దూ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, పంజాబ్ లో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతోందని సిద్దూ ఆరోపించారు. దేశంలో నిరంకుశం పెరిగినప్పుడల్లా విప్లవం వచ్చిందని, ఇప్పుడొచ్చిన విప్లవం పేరు రాహుల్ గాంధీ అని సిద్దూ అన్నారు.

కాగా 1988, డిసెంబర్ 27న కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ (65) అనే వ్యక్తితో సిద్ధూ, ఆయన ఫ్రెండ్ రూపిందర్ సింగ్ గొడవ పడ్డారు. గుర్నామ్ సింగ్ ను కారు బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. వ్యక్తిపై దాడికి పాల్పడి చావుకు కారణమయ్యారంటూ సిద్దూపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే గతేడాది ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సిద్ధూను దోషిగా తేలుస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది. కాగా గతేడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed