బెంగాల్‌లో హృదయవిదారక ఘటన.. అంబులెన్స్‌కు డబ్బుల్లేక బ్యాగ్‌లో బిడ్డ శవం దాచి బస్సులో ప్రయాణం!

by Disha Web Desk 12 |
బెంగాల్‌లో హృదయవిదారక ఘటన.. అంబులెన్స్‌కు డబ్బుల్లేక బ్యాగ్‌లో బిడ్డ శవం దాచి బస్సులో ప్రయాణం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ కు ఇచ్చేందుకు డబ్బులు లేక ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో దాచి 200 కిలోమీటర్ల దూరం బస్సులో తీసుకు వెళ్లారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర దినాజ్పూర్ జిల్లా కలియాగంజ్ ప్రాంతానికి చెందిన అసిమ్ దేవశర్మ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడికి ఐదు నెలల వయసు కలిగిన ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.

ఇటీవల వీరిద్దరు అనారోగ్యానికి గురి కావడంతో కలియాగంజ్ లోని జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అయినా పరిస్థితి మరింత సీరియస్ కావడంతో మెరుగైన వైద్యం కోసం చిన్నారులను సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ కవలల్లో ఒకరి ఆరోగ్యం మెరుగు పడింది. దీంతో దేవ శర్మ ఆ బిడ్డను తన భార్యతో పాటు ఇంటికి పంపించాడు. మరో కుమారుడు చికిత్స పొందుతూ గత శనివారం రాత్రి మృతి చెందాడు.

కుమారుడి మృతదేహాన్ని తరలించేందుకు అబులెన్సు కోసం సంప్రదిస్తే రూ.8 వేలు ఇస్తే కానీ రాలేమని డ్రైవర్లు తేల్చి చెప్పారు. దీంతో అంత డబ్బు చెప్పుకోలేని స్థితిలో ఉన్న దేవశర్మ.. తన కుమారుడి మృతదేహాన్ని బస్సులో తరలించాడు. మృతదేహంతో ప్రయాణిస్తే తోటి ప్రయాణికులు అభ్యంతరం చెబుతారని శవాన్ని బ్యాగులో దాచి తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి మరో అంబులెన్సు మాట్లాడుకుని తన ఇంటికి కుమారుడి మృతదేహాన్ని తీసుకువెళ్లాడు. ఈ ఘటన బెంగాల్ రాజకీయంలో దుమారం రేపుతోంది. దీనిపై అధికార టీఎంసీపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మమతా బెనర్జీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్వాస్థ్య సాథి' స్కీమ్ ఏమైందని నిలదీశారు. బెంగాల్ మోడల్ అంటే ఇదేనా అని ఫైర్ అయ్యారు. అయితే బీజేపీ విమర్శలపై టీఎంసీ రివర్స్ ఎటాక్ ప్రారంభించింది. బీజేపీ శవ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టింది. కాగా ఈ వ్యవహారంపై అంబులెన్స్ డ్రైవర్లు స్పందిస్తూ 102 పథకం కింద రోగులకు మాత్రమే మృతదేహాలను ఉచితంగా తరలించే అవకాశం ఉందని మిగతా మృతదేహాలను తీసుకువెళ్లాలంటే డబ్బులివాల్సిందే అని డ్రైవర్లు చెప్పారు.

Next Story

Most Viewed