పెట్రోల్, డీజిల్ ధరలపై మోడీ వ్యాఖ్యలకు సీఎం అశోక్ గెహ్లాట్ కౌంటర్

by Harish |
పెట్రోల్, డీజిల్ ధరలపై మోడీ వ్యాఖ్యలకు సీఎం అశోక్ గెహ్లాట్ కౌంటర్
X

జైపూర్: బీజేపీని గెలిపిస్తే రాజస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరలను పునర్ సమీక్షిస్తామని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌లపై ఆ రాష్ట్రాలే పెద్దఎత్తున ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నాయని ఆరోపించారు.

సోమవారం జైపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గెహ్లాట్ మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లలో అమల్లో ఎక్సైజ్ సుంకాలను పోలుస్తూ ప్రధాని మోడీకి పలు ప్రశ్నలను సంధించారు. రాజస్థాన్‌తో పోలిస్తే మధ్యప్రదేశ్‌లోనే ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉందని, ఫలితంగా అక్కడే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అన్ని రాష్ట్రాల్లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర సర్కారుకు ఉందన్నారు. ‘‘ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన ఎక్సైజ్ సుంకాన్ని అమలు చేయడం ద్వారా దేశ ప్రజలను మోడీ సర్కారు దగా చేస్తోంది. రాష్ట్రాలతో కేంద్రం అన్యాయంగా ప్రవర్తిస్తోంది’’ అని సీఎం గెహ్లాట్ మండిపడ్డారు.

‘‘రాష్ట్రాలకు పంపిణీ చేసే ప్రాథమిక ఎక్సైజ్ సుంకాన్ని తొలగించి.. దాని స్థానంలో కొత్త ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిలో అదనపు ఎక్సైజ్ సుంకాలు 1, 2 సెస్సులు ఉన్నాయి. వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బును తమ ఖాతాలోకి మళ్లిస్తుండటంతో రాష్ట్రాలు తమ వాటా హక్కును పొందలేకపోతున్నాయి. తద్వారా రాష్ట్రాలకు, దేశ ప్రజలకు అన్యాయం జరుగుతోంది’’ అని ఆయన వివరించారు.

Advertisement

Next Story

Most Viewed