దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్రాస్ ఎగ్జామినేషన్.. ఇలా జరిగింది

by Dishanational4 |
దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్రాస్ ఎగ్జామినేషన్.. ఇలా జరిగింది
X

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా ఒక ఎన్నికల రిటర్నింగ్ అధికారిని స్వయంగా భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్‌ను సీజేఐ డీవై చంద్రచూడ్ సోమవారం క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వ్యవహారంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలను నోట్ చేసుకున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగుచూడాలంటే అనిల్ మసీహ్‌ను తప్పకుండా విచారించాల్సిందే అని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను మంగళవారం కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఇక ఆదివారం రోజు ముగ్గురు ఆప్‌ కౌన్సిలర్‌లు బీజేపీలోకి జంపయ్యారు. ఈ అంశాన్ని కూడా విచారణ సందర్భంగా ప్రస్తావించిన సీజేఐ.. ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు తీవ్రమైన విషయమని కామెంట్ చేశారు.

క్రాస్ ఎగ్జామిషన్ జరిగిందిలా..

“మిస్టర్ అనిల్ మసీహ్.. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే మీపై విచారణ చేయిస్తాం. ఇది తీవ్రమైన విషయం. మేం వీడియో చూశాం. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు (X) వేస్తూ.. మీరు కెమెరా వైపు చూడటం అందులో రికార్డయింది. ఆ టైంలో మీరేం చేశారు ?ఎందుకు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేయాల్సి వచ్చింది ?’’ అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్.. ‘‘ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై నేను క్రాస్ (X) మార్కులు వేసింది నిజమే. చెల్లవని నిర్ణయించిన బ్యాలెట్ పత్రాలను వేరు చేసేందుకుగానూ అలా చేయాల్సి వచ్చింది’’ అని చెప్పారు. ‘‘మీరు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారు ? పత్రాలపై సంతకం మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి హోదాలో బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు కూడా వేయొచ్చని నిబంధనల్లో ఎక్కడా లేదే ?’’ అని సీజేఐ చంద్రచూడ్ కామెంట్ చేశారు. ఆ వెంటనే చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వైపు తిరిగిన సీజేఐ.. అనిల్ మసీహ్‌ను విచారణ చేయాల్సిందే అని నిర్దేశించారు. ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ జోక్యం చేసుకున్నారని తుషార్ మెహతాకు సీజేఐ చెప్పారు.

నెక్ట్స్ ఏమిటి ?

అయితే కొత్త రిటర్నింగ్ అధికారిని నియమించి ఓట్లను మరోసారి లెక్కిస్తారా ? మేయర్ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇస్తారా ? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగగా 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించారు. దీంతో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడిగా ఉన్న అనిల్ మసీహ్ ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ మేయర్ అభ్యర్ధికి పడిన ఓట్లను రద్దు చేశారని ఆరోపిస్తూ ఆప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కెమెరా వైపు చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ఏదో రాస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో బయటికి రావడం అప్పట్లో కలకలం రేపింది. ఇంతకుముందు ఫిబ్రవరి 5న సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. అనిల్ మసీహ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించారని అప్పట్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.



Next Story