విద్యుత్ వినియోగంలో సరికొత్త రూల్స్: పగలొక లెక్క.. రాత్రొక లొక్క

by Dishafeatures2 |
విద్యుత్ వినియోగంలో సరికొత్త రూల్స్: పగలొక లెక్క.. రాత్రొక లొక్క
X

న్యూఢిల్లీ: కరెంటు బిల్లులు తగ్గనున్నాయా..? విద్యుత్ వినియోగంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం కరెంటును పగలు (సోలార్ అవర్స్) వాడితే చార్జీల మోత 20% మేర తగ్గనుంది. అదే డిమాండ్ ఎక్కువగా ఉండే రాత్రి వేళ (పీక్ అవర్స్) కరెంటు వాడితే 10-20% ఎక్కువ వసూలు చేయనుంది. దీన్ని బట్టి పగలో లెక్క.. రాత్రొక లెక్క అన్నమాట. ‘టైమ్ ఆఫ్ డే’ టారిఫ్ సిస్టమ్ పేరుతో తీసుకొచ్చే కొత్త విధానాన్ని 10 కిలోవాట్లు, అంతకన్నా ఎక్కువ వాడే కమర్షియల్, ఇండస్ట్రీయల్ వినియోగదారులకు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. మిగిలిన వినియోగదారులకు 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామన్నారు. రైతులకు ఈ కొత్త విధానం నుంచి మినహాయింపు ఇస్తామన్నారు. వినియోగదారులు ఏ సమయంలో ఎంత విద్యుత్ ను వినియోగించారో స్మార్ట్ మీటర్ల ద్వారా గుర్తిస్తామని పేర్కొన్నారు.

టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ అంటే..

విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ ద్వారా కరెంటు బిల్లుల భారం నుంచి వినియోగదారులకు భారీ ఊరట కలుగుతుంది. టైమ్ ఆఫ్ డే నియమాలను కచ్ఛితంగా పాటించే వారికి అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వినియోగదారులు తమ ఎలక్ట్రిసిటీ బిల్లును తగ్గించుకునేందుకు, విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు ఈ టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ ఉపకరిస్తుంది. ఉదయం వేళ సోలార్ ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉండటం వల్ల ఆ సమయంలో ధరను తగ్గించారు. రాత్రి వేళ హైడ్రో, థర్మల్, బయోమాస్ విద్యుత్ వినియోగాన్ని పెంచాల్సి ఉండటంతో టారిఫ్ పెంచారు. డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో విద్యుత్ ను వినియోగించుకునేలా కన్జ్యూమర్లను ప్రోత్సహించేందుకు ఈ కొత్త విధానం ఉపకరిస్తుంది.

భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

స్మార్ట్ మీటర్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులకు పెనాల్టీ చార్జీలు పడే అవకాశం లేదు. ఎదుకంటే స్మార్ట్ మీటర్ పెట్టక ముందే గరిష్ట డిమాండ్ ను రికార్డు చేస్తారు. అంతేకాదు.. స్మార్ట్ మీటర్ బిగించిన తేదీకి ముందు వరకు వినియోగించిన విద్యుత్తుపై అదనపు చార్జీలు వసూలు చేయరు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఈ వినియోగం రానున్న నాలుగేళ్లలో రెట్టింపు అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో టారిఫ్ లో కొత్త రూల్స్ తో గ్రిడ్ లపై భారం తగ్గుతుందని అంచనా వేస్తోంది.


Next Story

Most Viewed