జమిలి ఎన్నికలపై కేంద్రం స్పీడ్.. త్వరలో కేబినెట్​ ముందుకు నివేదిక!

by Prasad Jukanti |
జమిలి ఎన్నికలపై కేంద్రం స్పీడ్.. త్వరలో కేబినెట్​ ముందుకు నివేదిక!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాను సూచించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా సంచలనాలకు తెర లేపబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.. సాధ్యమైనంత త్వరలో ఈ పనిని పూర్తి చేయాలని న్యాయశాఖ భావిస్తోందని శుక్రవారం సంబంధింత వర్గాలు పేర్కొన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉండటంతో బీజేపీ ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని విజయవంతంగా తీరం దాటిస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

న్యాయశాఖ100 డేస్ అజెండా:

దేశవ్యాప్తంగా ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు జమిలీ ఎన్నికలు నిర్వహించేలా మార్పులు తీసుకురావాలని బీజేపీ తన లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సమయం, ప్రజాధనం దుర్వినియోగాన్ని తగ్గించవచ్చని బీజేపీ వాదిస్తోంది. ఈ మేరకు రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గతేడాది ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయంలో అధ్యయం చేసిన కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం మొదటి దశగా లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని, అనంతరం 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలను సూచించింది. అంతేకాకుండా ఈ సిఫారసుల అమలును పరిశీలించేందుకు ఒక 'అమలు బృందం' నియమించాలని, అలాగే ఇందు కోసం 18 రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ లో కేంద్రం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయడంతో జమిలీ ఎన్నికలపై నిర్ణయం ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. అయితే లోక్​సభ ఎన్నికలకు ముందు, తదుపరి ప్రభుత్వం కోసం 100రోజుల అజెండాను రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించారు. అయితే న్యాయ మంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్​ విభాగం 100 రోజుల అజెండాలో భాగంగా ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

కూటమి పార్టీలు సహకరించేనా?:

గత రెండు దఫాలుగా కేంద్రంలో ఎన్డీయే కూటమియే అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీకి సొంత మెజార్టీతో ఉండటం వల్ల ఏదైనా నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోగలిగింది. కానీ ప్రస్తుతం ఫుల్ మెజార్టీ లేని కారణంగా ప్రభుత్వాన్ని నడిపేందుకు కూటమి నేతల సపోర్ట్ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణల విషయంలో మోడీ సర్కార్ కు పూర్తి స్థాయిలో సహకారం లభిస్తుందా అనేది చర్చనీయాశం అవుతోంది. కూటమిలో కీలకంగా భావిస్తున్న జేడీయూ, టీడీపీలు జమిలీ ఎన్నికలకు ఇదివరకు ఓకే చెప్పాయి. కానీ అసలు సమయానికి ఇదే స్టాండ్ పై నిలబడతాయా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ గతంలోనే తిరస్కరించింది. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల విషయంలో మోడీ సర్కార్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.Next Story

Most Viewed