రంగంలోకి సీబీఐ.. ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు షురూ

by Disha Web Desk 13 |
రంగంలోకి సీబీఐ.. ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాప్తు షురూ
X

బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తును ప్రారంభించింది. బాలాసోర్ రైల్వే పోలీసులు ఈనెల 3న నమోదు చేసిన కేసు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. పది మంది సభ్యుల సీబీఐ ఆఫీసర్స్ టీమ్ మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. వారి వెంట ఫోరెన్సిక్ నిపుణుల టీమ్ కూడా వెళ్లి సాక్ష్యాలను సేకరించింది. ఇక సీబీఐ కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది.

రైల్వే శాఖ, కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ (డీఓపీటీ), ఒడిశా ప్రభుత్వం సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఖరగ్‌పూర్, బాలాసోర్‌ సహా పలు ప్రాంతాల్లో ఎంక్వైరీ చేయగా లభ్యమైన సమాచారాన్ని కూడా రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఆర్ఎస్) టీమ్ సీబీఐకి అందిస్తుందని సౌత్ ఈస్టర్న్ రైల్వే సీపీఆర్‌వో ఆదిత్య కుమార్ చౌదరి మీడియాకు చెప్పారు.

ఇప్పటికే ఈ ప్రమాద ఘటనపై కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ బృందం కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ దర్యాప్తు కూడా దీనికి సమాంతరంగా కొనసాగనుంది. ప్రమాదానికి గురైన కోరమాండల్‌, బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్సు రైలులో విధులు నిర్వహించిన లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకోపైలట్లు, ప్రమాదం జరిగిన స్టేషన్‌లోని సిగ్నలింగ్‌ సిబ్బంది సహా 55 మందిని ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఆర్ఎస్) టీమ్ విచారించింది. మూడు రైళ్లలో విధుల్లో ఉన్న పలువురు ఇతర ఉద్యోగులను, ప్రమాదం జరిగిన స్టేషన్‌తోపాటు పక్క స్టేషన్లలో సిబ్బందిని ప్రశ్నించి వివరాలను తెలుసుకున్నారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు పూర్తికావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.

గాయాలు లేకుండా ఆ 40 మృతదేహాలు..

ఇక అంతకుముందు బాలాసోర్ రైల్వే పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లోని పలు కీలక విషయాలు బయటికొచ్చాయి. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నుంచి వెలికితీసిన దాదాపు 40కి పైగా మృతదేహాలపై గాయాలు కానీ, రక్తస్రావం కానీ కనిపించలేదని ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు. " గూడ్స్ ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టి .. గూడ్స్ పైకి అది దూసుకెళ్లడంతో రైల్వే విద్యుత్ వైర్లు తెగి బోగీలపై పడ్డాయి. అలా విద్యుత్ వైర్లు పడిన బోగీలలోని ప్రయాణికులు కరెంట్ షాక్ తో చనిపోయి ఉండొచ్చు" అని అందులో తెలిపారు.

113 డెడ్ బాడీస్ ఎవరివో తెలియట్లేదు..

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 278కి పెరిగిందని రైల్వే శాఖ ప్రకటించింది. చికిత్స పొందుతున్న మరో ముగ్గురు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మొత్తం 1100 మందికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయని ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ వెల్లడించారు. గాయపడిన వారిలో 900 మంది డిశ్చార్జ్‌ అయినట్లు చెప్పారు. మరో 200 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

భువనేశ్వర్ సిటీలోని వివిధ ఆస్పత్రుల్లో ఉన్న 193 మృతదేహాల్లో 80 మృతదేహాల వివరాలు గుర్తించామని.. మిగితా 113 డెడ్ బాడీస్ వివరాలు ఇంకా దొరకలేదని భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్‌ విజయ్‌ అమృత్‌ కులంగే చెప్పారు. వివరాలు గుర్తించిన 55 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మృతదేహాలకు సంబంధించి భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1929కు 200 ఫోన్‌కాల్స్ వచ్చినట్లు కమిషనర్‌ వివరించారు.

Next Story