జీఎస్టీ చట్టాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by Disha Web Desk 17 |
జీఎస్టీ చట్టాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

న్యూఢిల్లీ: జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మండలి చేసే చట్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన హక్కులు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జీఎస్టీ మండలి చేసే ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు కానీ మనది సహకార సమాఖ్య వ్యవస్థ కాబట్టి ఆ నిర్ణయాలకు విలువ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. వివరాల్లోకి వెళితే సముద్రంలో సరకు రవాణాపై 5 శాతం ఐజీఎస్టీ విధిస్తూ 2017లో కేంద్రప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ని హైకోర్టు రద్దు చేసింది. ఓడలో సరకు రవాణాకు ఎలాంటి ఐజీఎస్టీ విధించాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్... జీఎస్టీ మండలి సిఫార్సులపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 246 ఏ ప్రకారం, పన్నులపై చట్టాలు చేసుకునే విషయమై పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు సమాన హక్కులున్నాయి. దీనిపై అవి వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చు. కానీ మనం సహకార సమాఖ్యలో ఉన్నందున ఆర్టికల్ 279 ప్రకారం కేంద్ర, రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవహరించకూడదు. ఈ చట్టాల అమలు విషయంలో విభేదాలు వస్తే మండలి సరైన సలహాలు ఇవ్వాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్దకుండా సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.


Next Story

Most Viewed