Bombay Court : తల్లిని చంపి శరీర భాగాలను ఉడికించిన కొడుకు.. ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు

by vinod kumar |
Bombay Court : తల్లిని చంపి శరీర భాగాలను ఉడికించిన కొడుకు.. ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: తన తల్లిని హత్య చేసి ఆమె శరీర భాగాలను వండుకుని తినేందుకు ప్రయత్నించిన కేసులో దోషిగా తేలిన సునీల్ రామ కుచ్‌కోర్వి అనే నిందితుడికి దిగువ కోర్టు విధించిన ఉరిశిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. దీనిని నరమాంస భక్షక కేసుగా అభివర్ణించిన కోర్టు.. దోషిలో సంస్కరణలకు ఆస్కారం లేదని పేర్కొంది. ఈ కేసు అరుదైన నేరాట కేటగిరీలోకి వస్తుందని న్యాయమూర్తులు రేవతి మోహితే డేరే, పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇంతకంటే భయంకరమైన, అనాగరికమైన కేసును ఇప్పటివరకు చూడలేదని తెలిపింది. కూచుకొరవికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే, ఇతర ఖైదీలకు ముప్పు వాటిల్లుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సునీల్ మద్యానికి బానిసై 2017 ఆగస్టు 27న తన తల్లి ఎల్లమ్మ(63)ను దారుణంగా హత్య చేశాడు. అంతేగాక ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి వాటిని వండుకుని తినేందుకు ప్రయత్నించాడు. తల్లి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన కొల్హాపూర్ కోర్టు 2021లో అతనికి మరణశిక్ష విధించింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ట్రయల్ కోర్టు తీర్పు సరైందేనని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed