తమిళిసైని ఆమె నివాసంలో కలిసిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై

by S Gopi |
తమిళిసైని ఆమె నివాసంలో కలిసిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కే అన్నామలై, తమిళిసై సౌందర్‌రాజన్‌ మధ్య విభేదాలు ముదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వివాదానికి ముగింపు పలుకుతూ కే అన్నామలై శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసంలో కలిశారు. సమావేశం అనంతరం అన్నామలై ఎక్స్‌లో వారి సమావేశం గురించి స్పందిస్తూ.. 'గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన సీనియర్ నాయకురాలు డా తమిళిసై సౌందరరాజన్ నన్ను ఆమె నివాసానికి పిలవడం సంతోషంగా ఉంది. ఆమె రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ ఎదుగుదలకు స్పూర్తినిస్తాయని' ట్వీట్ చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం విశేషం. లోక్‌సభ ఎన్నికల తర్వాత, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ అన్నారు. బీజేపీ-ఏఐఏడీఎంకె విడిపోవడానికి అన్నామలై కారణమని ఆరోపించిన ఏఐఏడీఎంకె నేతకు ఆమె బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. ఏఐఏడీఎంకె నేత వేలుమణి చెప్పింది నిజమే. రెండు పార్టీల మధ్య పొత్తు జరిగి ఉంటే డీఎంకే అన్ని సీట్లలో గెలిచేది కాదని జూన్ 6న ప్రకటనలో చెప్పారు. అంతేకాకుండా ఎవరి పేరును ప్రస్తావించకుండా బీజేపీలోకి ‘సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చార’న్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేదికపైనే తమిళిసైతో ఆగ్రహంగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. తమిళనాట అన్నామలైతో ఆమెకున్న వివాదం గురించే అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు కథనాలు వినిపించాయి. ఇది జరిగిన రెండు రోజులకే తమిళిసైని అన్నామలై కలవడం గమనార్హం. అయితే, అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే అంశంపై తమిళిసై సౌందరరాజన్ అవన్ని అనవసర ఊహాగానాలని కొట్టిపారేశారు.Next Story

Most Viewed