ఒడిశా బాధితులకు పరిహారం కింద రూ.2 వేల నోట్లు.. TMC పార్టీపై బీజేపీ ఫైర్!

by Satheesh |
ఒడిశా బాధితులకు పరిహారం కింద రూ.2 వేల నోట్లు.. TMC పార్టీపై బీజేపీ ఫైర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్‌లోని అధికార టీఎంసీకి ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ వ్యవహారం వెనుక కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉందని టీఎంసీ ఆరోపిస్తుంటే.. అలాంటిదేమి లేదని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు పరిహారం కింద టీఎంసీ రూ.2000 నోట్లను పంచుతోందని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మంజుదార్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇందుకు సంబంధించి బాధితులు తమ చేతిలో రూ.2000 వేల నోట్లను పట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై మంజుదార్ స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. మమతా బెనర్జీ సూచనల మేరకు రాష్ట్ర మంత్రి ఒకరు తృణమూల్ పార్టీ తరపున బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే బాధితులను ఆదుకోవాలనే ఆలోచనను తాను అభినందిస్తున్నప్పటికీ.. పరిహారం ముసుగులో మమతా బెనర్జీ బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కష్టకాలంలో ఉన్న వారికి రూ.2 వేల నోట్ల కట్టలను ఇవ్వడం ఏంటని నిలదీశారు. తమ వద్ద పోగైన నల్లధనాన్ని పెద్ద నోట్ల రూపంలో బాధిత కుటుంబాలకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మరో వైపు మంజుదార్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రభుత్వం పరిహారం నగదు రూపంలో ఇవ్వదని చెక్ రూపంలోనే ఇస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చెక్కులను మార్చుకున్నప్పుడు ఆర్బీఐ నిబంధనల మేరకు బ్యాంకులు సైతం రూ.2 వేల నోట్లను ఎవరికి జారీ చేయడం లేదని కామెంట్స్ పెడుతున్నారు.



Next Story