రాజ్యసభ ఫలితాల్లో బీజేపీ హవా.. అక్కడ మీడియా అధినేతకు పరాభవం

by Disha Web Desk 4 |
రాజ్యసభ ఫలితాల్లో బీజేపీ హవా..  అక్కడ మీడియా అధినేతకు పరాభవం
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగు రాష్ట్రాల్లో 16 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హోరాహోరీగా జరిగిన ఈ పోలింగ్ లో బీజేపీ 8, విపక్ష కాంగ్రెస్ 5 సీట్లను దక్కించుకున్నాయి. ఏకగ్రీవం అయిన రాష్ట్రాలు మినహాయించగా మిగిలిన మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. కౌంటింగ్ సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఫలితాలు ఆలస్యమయ్యాయి. కర్ణాటకలో నాలుగు స్థానాలకు బీజేపీ మూడు, కాంగ్రెస్ ఒక సీటు దక్కించుకున్నాయి. బీజేపీ నుంచి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, నటుడు జగ్గేశ్, ఎమ్మెల్సీ లెహర్ సింగ్ సిరోయా గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ విజయం సాధించారు. ఇక్కడ బలం లేకపోయినా పోటీలో నిలిచిన జేడీఎస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు.

మహారాష్ట్రలో అధికార కూటానికి ఎదురుదెబ్బ

మహారాష్ట్రలో ఈ ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఇక్కడ ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, శివసేన, ఎన్ సీపీ ఒక్కో సీటు చొప్పున దక్కించుకున్నాయి. బీజేపీ నుండి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఎన్నికవ్వగా.. శివసేన నుంచి సంజయ్ రౌత్, ఎన్‌సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి ప్రతాప్ గర్హీలు విజయం సాధించారు. శివసేన నుంచి మరో అభ్యర్థి సంజయ్ పవార్ ఓటమి చెందటంతో మహావికాస్ అఘాడీకి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

మీడియా అధినేతకు షాక్

రాజస్థాన్ లో నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు స్థానాలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ నుంచి రణ్ దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీలు విజయం సాధించగా.. బీజేపీ నుంచి ఘన్ శ్యామ్ తివారీ పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఇక బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన జీ మిడియా అధినేత సుభాష్ చంద్ర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా కాంగ్రెస్ కు ఓటు వేయడం కలకలం రేపింది. దాంతో ఆమెను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

కాంగ్రెస్ కు ఊహించని షాక్

హర్యానాలో రెండు స్థానాలకు జరిగిన పోలింగ్ లో బీజేపీ అభ్యర్థి క్రిష్ణన్ లాల్ పన్వార్, బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కార్తికేయ శర్మ పెద్దల సభకు ఎంపికయ్యారు. అయితే ఓ కాంగ్రెస్ అభ్యర్థి క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం మరో ఎమ్మెల్యే ఓటు చెల్లకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ ఓటమిపాలయ్యారు.

మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయగా.. అందులో 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గత వారం ఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లోని మిగతా 16 సీట్లకు గాను శుక్రవారం పోలింగ్ జరిగింది.


Next Story