ఉమ్మడి పౌరస్మృతిపై నిబద్ధంగానే ఉన్నాం

by Disha Web Desk 7 |
ఉమ్మడి పౌరస్మృతిపై నిబద్ధంగానే ఉన్నాం
X

న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి అమలు పట్ల తాము నిబద్ధంగా ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రజాస్వామిక చర్చలు ముగిసిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని కచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్కాణించారు. బీజేపీ పార్టీయే లేనప్పుడు జనసంఘ్ రోజుల నుంచే దేశ ప్రజలకు ఉమ్మడి పౌర స్మృతిపై వాగ్దానం చేశామని తెలిపారు. బీజేపీనే కాదు, రాజ్యాంగ సభ కూడా అనుకూలమైన సమయంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని అప్పట్లోనే పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు సలహా ఇచ్చిందని షా చెప్పారు. ఎందుకంటే ఏ లౌకిక దేశంలో అయినా చట్టం మతప్రాతిపదికపై ఉండరాదన్నారు.

జాతి, ప్రభుత్వం సెక్యులర్‌గా ఉన్నట్లయితే, చట్టాలు మతప్రాతిపదికన ఎలా ఉంటాయని ప్రశ్నించారు. మత విశ్వాసాలు పాటించే ప్రతి వ్యక్తికీ పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన ఒకే చట్టాన్ని పాటించాల్సి ఉంటుందని షా చెప్పారు. రాజ్యాంగ సభ ఆనాడు ఇచ్చిన సలహాను ఇన్నాళ్లుగా పక్కన బెడుతూ వచ్చారని హోంమంత్రి ఆరోపించారు. ఒక బీజేపీ తప్ప దేశంలోని ఏ పార్టీ కూడా ఉమ్మడి పౌర స్మృతికి అనుకూలంగా లేవని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన చర్చ అవసరమే. ఈ అంశంపై ఆరోగ్యకరమైన, దాపరికం లేని చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ మతాలను పాటించే వ్యక్తులు ఉమ్మడి పౌర స్మృతిపై తమ అభిప్రాయాలను తెలపాలని, వారి సిఫార్సుల తర్వాతే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొస్తామని షా చెప్పారు.


Next Story