నాటో సదస్సులో బైడెన్ కీలక ప్రకటన

by Shamantha N |
నాటో సదస్సులో బైడెన్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: నాటో దేశాధినేతల సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా దాడులతో ఉక్కిరిబిక్కరివుతున్న ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఉక్రెయిన్ కు 5 వ్యూహాత్మక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని సరఫరా చేస్తామని ప్రకటించారు. వాషింగ్టన్ లో జరుగుతున్న నాటో సమావేశంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు 32 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రస్తుతం నాటో కూటమి ఎన్నడూ లేనంత శక్తిమంతంగా ఉందని అన్నారు. ఇకపోతే, ఉక్రెయిన్ కి ఆయుదాలు సరఫరా చేసేందుకు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమానియాతో కలిసి పనిచేస్తామన్నారు.

ఉక్రెయిన్ సురక్షితంగా ఉంటుందన్న బైడెన్

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సురక్షితంగా ఉంటుందని అన్నారు. రష్యా పరిస్థితి దారుణంగా మారుతుందని అన్నారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు, యాంటీ ఎయిర్ బ్యాటరీస్ ను ఉక్రెయిన్ కు నాటో సరఫరా చేయనుంది. మరోవైపు, గత కొంతకాలంగా ఆయుధాలు కావాలని పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పదేపదే కోరారు. దీంతో, ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు బైడెన్ నాటో సదస్సులో ప్రకటించారు. మరోవైపు, కీవ్ లోని పిల్లల ఆస్పత్రిపై రష్యా క్షిపణి దాడి జరిగింది. సోమవారం జరిగిన ఈ దాడిలో 43 మంది చనిపోయారు. ఆ దాడి జరిగిన రెండ్రోజులకే నాటోలో ఇలాంటి ప్రకటన వెలువడటం గమనార్హం.



Next Story

Most Viewed