- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాఠశాలల్లో మాంసాహారంపై నిషేధం.. ఆ జిల్లా విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం
జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో మాంసాహారాన్ని నిషేధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అస్సాంలోని గోల్పారా జిల్లాలో పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ‘బీఫ్’ తీసుకురావడం, తోటి విద్యార్థులను తినాల్సిందిగా బలవంతం చేశారని తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో మాంసాహారాన్ని నిషేధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..?
జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. జూన్ మొదటి వారంలో గోల్పారా జిల్లా కృష్ణాయి ప్రాంతంలోని హబ్రాఘాట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన ఐదుగురు ముస్లిం విద్యార్థులు తమ టిఫిన్ బాక్సుల్లో బీఫ్ తీసుకువచ్చారు. లంచ్ బ్రేక్‌లో దానిని తింటూ, ఇద్దరు హిందూ సహచర విద్యార్థులను కూడా తినాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. బాధితులు ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆయన దీనిని పైఅధికారుల వరకు తీసుకెళ్లకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్, ఎస్పీలు స్వయంగా పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
పోలీసుల చర్యలు - విచారణ కమిటీ ఏర్పాటు
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కృష్ణాయి పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు మైనర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఒక విద్యార్థి తల్లిని అసోం పశువుల రక్షణ చట్టం (Assam Cattle Preservation Act, 2021) కింద అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ 10 మంది సభ్యులతో కూడిన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సదరు విద్యార్థులను స్కూల్ నుండి బహిష్కరించాలా లేదా అనేది నిర్ణయిస్తారు.
మాంసాహారంపై నిషేధం..
ఈ వివాదం దృష్ట్యా గోల్పారా జిల్లా విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యాలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పాఠశాలలకు ఎలాంటి మాంసాహార పదార్థాలను తీసుకురాకూడదు. కేవలం శాఖాహార భోజనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే, గుడ్లను (Eggs) మాత్రం దీని నుంచి మినహాయించారు. మధ్యాహ్న భోజనం లేదా విరామ (Tiffin/Leisure) సమయంలో విద్యార్థులు పాఠశాల ప్రాంగణాన్ని విడిచి బయటకు వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని విద్యాశాఖ హెచ్చరించింది.






