కులాంత‌ర వివాహం చేసుకున్నార‌ని అంత్య‌క్రియ‌ల‌కు స‌హ‌క‌రించ‌ని గ్రామం!

by Disha Web Desk 20 |
కులాంత‌ర వివాహం చేసుకున్నార‌ని అంత్య‌క్రియ‌ల‌కు స‌హ‌క‌రించ‌ని గ్రామం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 27 సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్న కారణంగా సాంఘిక బహిష్కరణకు గురైన అతడి కుటుంబం ఇంకా ఆ భారాన్ని మోస్తూనే ఉంది. అత‌డి మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఈ ఛాంద‌స‌వాదం ప‌గ‌తీర్చుకుంటూనే ఉంది. దహన సంస్కారాలకు స్థానికులు సహాయం నిరాకరించడంతో, అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో ఒక గ్రామస్థుడి మృతదేహాన్ని హిందూ ఆచారాల ప్రకారం అధికారులు వెలికితీసి దహనం చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. దర్రాంగ్‌లోని పటోల్‌సింగ్‌పరా ప్రాంతంలో నివసిస్తున్న అతుల్ శర్మ అనే వ్యక్తి మంగళవారం మరణించాడు. అయితే గ్రామస్థులు అంత్యక్రియలకు సహాయం చేయడానికి నిరాకరించారని అతని భార్య పేర్కొంది. ఇక‌, తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించ‌డానికి దూరంగా ఉన్న కుమారుడు స‌మ‌యానికి చేరుకోలేకపోయాడు. దీనితో, "గ్రామస్తులు మాకు అంత్యక్రియలు పూర్తి చేయాలని చెప్పారు. నా భర్త సోదరుడు ఒకరు ముందుకు వచ్చారు. అయితే, అత‌నొక్క‌డే కావ‌డం వ‌ల్ల మృతదేహాన్ని ఖననం చేయగలిగాడు కానీ దహనం చేయలేదు," అని ఆమె చెప్పింది.

తన తల్లి 'నిమ్న కులానికి' చెందినది కావడం వ‌ల్ల, దాదాపు 27 ఏళ్ల క్రితం పెళ్లయినప్పటి నుంచి, తన తల్లిదండ్రులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారని కుమారుడు మీడియాతో వెల్ల‌డించాడు. ఈ ఘటన గురించి తెలియడంతో స్థానిక సివిల్, పోలీసు అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకుని కుటుంబసభ్యుల అంగీకారంతో మృతదేహాన్ని వెలికితీసేందుకు ఏర్పాట్లు చేశారు. "మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత, దహన సంస్కారాలు మేమే ఏర్పాటు చేశాము" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వ‌హించిన అనంతరం శుక్రవారం సాయంత్రం అతుల్ శర్మ కుమారుడు చితికి నిప్పంటించాడు. అతుల్ శర్మ భార్యకు చెందిన కోచ్-రాజ్బోన్షి కమ్యూనిటీ ప్రతినిధులు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి, ఒకరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేదని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.


Next Story