మాతో టచ్‌లో మరో 9 మంది.. హిమాచల్ ‘రెబల్’ షాకింగ్ ప్రకటన

by Hajipasha |
మాతో టచ్‌లో మరో 9 మంది.. హిమాచల్ ‘రెబల్’ షాకింగ్ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్ సర్కారు రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కినట్టేనని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఓ వైపు చెబుతుంటే.. ఆట ఇప్పుడే మొదలైందని రెబల్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేల గ్రూపుతో మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజిందర్ రాణా వెల్లడించారు. సీఎం సుఖు తన ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చెబుతున్న విధంగా రెబల్ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా మళ్లీ వెనక్కి వెళ్లే ఆలోచన కూడా చేయడం లేదని రాజిందర్ రాణా స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకే తాము రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశామని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తిని లేదా సోనియాగాంధీని పోటీకి నిలిపి ఉంటే ఫలితం మరోలా వచ్చి ఉండేదని ఆయన పేర్కొన్నారు. అనర్హత వేటు పడిన ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందర్‌దత్ లఖన్‌పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది ఇప్పుడు మమ్మల్ని తిరుగుబాటుదారులు, రెబల్స్ అని పిలుస్తున్నారు. కానీ మేం అలాంటి వాళ్లం కాదు. మేం మా మనస్సాక్షిని విన్నాం. ఇది మా వ్యక్తిగత నిర్ణయం’’ అని తెలిపారు. ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిస్తూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని మరో తిరుగుబాటు ఎమ్మెల్యే వెల్లడించారు. ‘‘రాష్ట్రంలోని 80 శాతం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీతోనే ఉన్నారు. చిన్నచిన్న విషయాలపై విభేదాలతో మిగతా వారితో తాత్కాలికంగా గ్యాప్ ఏర్పడింది. త్వరలో వాళ్లు కూడా మాతో చేయి కలుపుతారు. రెబల్స్ మళ్లీ మా వైపునకు రావడం ఖాయం’’ అని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తాజాగా శనివారం పేర్కొన్నారు.



Next Story

Most Viewed