కుల సర్టిఫికెట్ ఆరోపణలపై సమీర్ వాంఖడేకు క్లీన్‌చీట్

by Disha Web Desk 16 |
కుల సర్టిఫికెట్ ఆరోపణలపై సమీర్ వాంఖడేకు క్లీన్‌చీట్
X

ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ ముంబై జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే‌కు కుల సర్టిఫికెట్ విషయంలో క్లీన్‌చీట్ లభించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ సర్టిఫికెట్ సమర్పించారన్న ఆరోపణలపై క్యాస్ట్ పరిశీలన కమిటీ స్పష్టత ఇచ్చిందని శనివారం అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆదేశాలను శుక్రవారమే మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) అఫీసర్ సమీర్ వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని, షెడ్యూల్ క్యాస్ట్‌లోని మహర్ క్యాస్ట్‌కు చెందిన వారని నిరూపితమైనట్లు ఆదేశాల్లో పేర్కొంది. అంతకుముందు వాంఖడే ఉద్యోగం కోసం నకిలీ కుల సర్టిఫికెట్ ఉపయోగించారని మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ లేవనెత్తారు. దీనికి మద్దతుగా మనోజ్ సన్సారే, అశోక్ కాంబ్లే, సంజయ్ కాంబ్లేలు వాంఖడేపై ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పరిశీలన చేపట్టిన కమిటీ తాజాగా వాంఖడేకు క్లీన్‌చీట్ ఇచ్చింది.

వాంఖడే, అతని తండ్రి జ్ఞాన్‌దేవ్ వాంఖడే హిందూ మతాన్ని త్యజించి ఇస్లాం మతంలోకి మారినట్లు రుజువు కాలేదని ఉత్తర్వు పేర్కొంది. దీనిపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడే స్పందించారు. సత్యమే చివరికి విజయం సాధించిందని పోస్టు చేశారు. ఈ అంశం వల్ల తాను ఇబ్బంది పడ్డానని, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. చనిపోయిన తల్లిని కూడా ఇందులోకి లాగడం బాధకరమని వాంఖడే పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను వాంఖడే బృందమే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.



Next Story