‘‘హైకోర్టు తప్పు చేస్తే.. మేమూ చేయాలా?’’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
‘‘హైకోర్టు తప్పు చేస్తే.. మేమూ చేయాలా?’’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. బెయిల్ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే తాము తీర్పు ఇస్తామని, అప్పటివరకు వేచి ఉండాలని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఒకవేళ ఇప్పుడే ఆదేశాలిస్తే.. అది ముందస్తు తీర్పే అవుతుందని న్యాయమూర్తులు జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వాదనలు ఇలా..

కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రమ్‌చౌదరీ.. ఈడీ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజు వాదనలు వినిపించారు. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్‌ ఆర్డర్‌‌ను చూడకముందే హైకోర్టు స్టే ఇవ్వగలిగినప్పుడు.. మీరెందుకు (సుప్రీం ధర్మాసనం) హైకోర్టు ఆర్డరుపై స్టే విధించలేరు? అని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. ట్రయల్ కోర్టు బెయిల్ ఉత్తర్వులపై హైకోర్టు అలా స్టే విధించడం ఊహించని విషయమన్నారు. కింది కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఎందుకు వేచి ఉండాలని వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘హైకోర్టు నిర్ణయం కాస్త అసాధారణంగానే కనిపిస్తోంది. ఒకవేళ హైకోర్టు తప్పిదం చేస్తే.. మేమూ దాన్ని రిపీట్ చేయాలా?’’ అని అభిషేక్‌ మను సింఘ్వీని ప్రశ్నించింది. ఒకరోజు వేచిచూడడం వల్ల ఇబ్బంది ఏముందన్న ధర్మాసనం.. విచారణను జూన్‌ 26కు వాయిదా వేసింది. ఇక కేజ్రీవాల్‌ బెయిల్‌ స్టే ఆర్డరుపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.Next Story

Most Viewed