మణిపూర్‌ రాజధానిలో మళ్ళీ ఘర్షణలు

by Dishafeatures2 |
మణిపూర్‌ రాజధానిలో మళ్ళీ ఘర్షణలు
X

ఇంఫాల్‌ : మణిపూర్‌లో మళ్ళీ ఉద్రిక్తత ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం రాజధాని ఇంఫాల్ లోని లోకల్ మార్కెట్‌లో దుకాణాలకు స్థలం కేటాయింపు విషయంలో మైతై, కుకీ కమ్యూనిటీలు గొడవకు దిగాయి. నగరంలోని న్యూ చెకాన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో హుటాహుటిన సైన్యం, పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. గుర్తు తెలియని దుండగులు చాసాద్ అవెన్యూ ఏరియాలో కొన్ని ఇళ్లతో పాటు ఒక ప్రార్థనా స్థలానికి.. లంబూ లేన్ ఏరియాలో కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దీంతో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఇంఫాల్ లో కర్ఫ్యూ విధించారు. జనం గుమిగూడిన ఒక ప్రదేశంలో మాజీ ఎమ్మెల్యే టియెన్‌ హాకిప్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాదాపు నాలుగు ఇండ్లకు దుండగులు నిప్పు పెట్టారని తెలుస్తోంది. మంటల్లో ఇళ్ళు కాలిపోతున్న దృశ్యాలు.. వాటిని ఆర్పేందుకు అక్కడికి చేరుకున్న ఫైరింజన్ల విజువల్స్ తో కూడిన వీడియోలు న్యూస్ ఛానళ్లలో కనిపించాయి.

ఈ అల్లర్ల పై ఆందోళన వ్యక్తం చేస్తూ కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ట్వీట్ చేసిందంటూ ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. " ఓ వర్గం వారు మా కాలనీలను, ఇళ్లను, ప్రార్ధనా స్థలాలను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి పోయిందో అర్ధం కావడం లేదు. కేంద్ర సర్కారు ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదు. మమ్మల్ని ఈ అగ్ని గుండంలో ఒంటరిగా వదిలేశారు" అంటూ కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సోమవారం మధ్యాహ్నం 3.14 గంటలకు ట్వీట్ చేసిందని కథనాల్లో ప్రస్తావించారు. ఈనేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు మరో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల ఆరంభంలో కూడా మణిపూర్ లోని 10 జిల్లాల పరిధిలోని పలుచోట్ల చెలరేగిన అల్లర్లలోనూ దాదాపు 70 మంది చనిపోయారు.





Next Story

Most Viewed