జననాల రేటు తగ్గుదల వెనుక ఐఫోన్?.. 2007 తర్వాత ఏం జరిగింది? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

by Prasad Jukanti |

ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు వేగంగా పడిపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతున్న వేళ తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

జననాల రేటు తగ్గుదల వెనుక ఐఫోన్?.. 2007 తర్వాత ఏం జరిగింది? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జనాభా స్థిరంగా ఉండేందుకు అవసరమైన దానికంటే దిగువకు పడిపోతుండటం కొత్త భయాలను పుట్టిస్తోంది. సాధారణంగా జీవన ప్రమాణాలు మెరుగుపడే కొద్దీ సమాజంలో జనన రేట్లు తగ్గడం సహజమే అయినా గత రెండు దశాబ్దాలలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకేలా పుట్టుకల రేటు పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటా అని దృష్టి సారించిన శాస్త్రవేత్తలకు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మన చేతుల్లో ఉండే ఐఫోన్ తో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుదల ఈ మార్పుకు ప్రధాన కారణం కావచ్చని రెండు సరికొత్త అధ్యయనాలు వెల్లడించాయి.

నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనే తక్కువ పుట్టుకలు:

2007లో ఐఫోన్ మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటులో స్పష్టమైన క్షీణత ప్రారంభమైందని తాజా పరిశోధనలు పేర్కొన్నాయి. 'నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్' ప్రచురించిన నివేదిక ప్రకారం 1980 నుండి 2007 వరకు అమెరికాలో ప్రతి 1,000 మంది మహిళలకు 65 నుండి 70 ప్రసవాలు జరిగేవి. కానీ 2007 తర్వాత ఇది వేగంగా పడిపోయింది. 2024 నాటికి 54 కి చేరుకుంది. అంటే 17 ఏళ్లలో ఏకంగా 22 శాతం క్షీణత నమోదైనట్లు ఈ అధ్యయనం తెలిపింది. అయితే, జనన రేట్లపై ఐఫోన్ ప్రభావాన్ని అంచనా వేయడం సంక్లిష్టమైన అంశమే అయినప్పటికీ 2007 నుండి 2011 మధ్య అమెరికాలో ఐఫోన్ కేవలం 'AT&T' నెట్‌వర్క్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. దీన్ని ఒక ప్రయోగంగా తీసుకున్న పరిశోధకులు.. AT&T నెట్‌వర్క్ పూర్తిగా ఉన్న ప్రాంతాలను, నెట్‌వర్క్ లేని ప్రాంతాలతో పోల్చి చూశారు. నెట్‌వర్క్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్న కౌంటీలలో 15-19 ఏళ్ల యువతుల్లో ప్రసవాల రేటు 4.5 నుండి 8 శాతం, 20-24 ఏళ్ల వారిలో 3.2 నుండి 6.6 శాతం తగ్గింది. మొత్తంగా చూస్తే, 2007-2011 మధ్య కాలంలో సంతానోత్పత్తి రేటు తగ్గడానికి 33 నుండి 52 శాతం కారణం ఐఫోన్ యాక్సెస్ కారణం అని ఈ పరిశోధనలో తేలినట్లు జాతీయ మీడియాలో కథనం పేర్కొంది. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో టీనేజ్ పుట్టుకలు 13.8 శాతం తగ్గితే, పూర్తి నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఏకంగా 26 శాతం తగ్గినట్లు ఈ పరిశోధన పేర్కొంది.

ఐఫోన్ జననాల రేటుపై ప్రభావం చూపిందా?

జననాల రేటు తగ్గడానికి ఐఫోన్ ఒక్కటే కారణం కాకపోయినప్పటికీ అది ఒక పెద్ద పాత్ర పోషించిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఐఫోన్‍తో పాటు ఇతర ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లకు ప్రజాదరణ పెరగడంతో ప్రజలు భౌతిక ప్రపంచంలో స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించుకున్నారని, దీనితో లైంగిక కార్యకలాపాలు తగ్గడంతో పాటు అశ్లీల చిత్రాల వినియోగం పెరిగిందని పేర్కొన్నారు. అలాగే గర్భనిరోధక సాధనాలు, అబార్షన్ల సమాచారం యువతకు సులభంగా లభించడం కూడా ఈ పరిస్థితికి కారణం కావొచ్చని అంచనా వేశారు.

ప్రపంచ దేశాలపై ప్రభావం:

'యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి' ఆర్థికవేత్తలు ప్రపంచ బ్యాంక్ డేటాను ఉపయోగించి 128 దేశాలలో పరిశోధన చేశారు. ఇరాన్, కోస్టారికా, గ్వాటెమాలా, చిలీ, మెక్సికో, టర్కీ వంటి భిన్నమైన సంస్కృతులు, చట్టాలు ఉన్న దేశాల్లో కూడా స్మార్ట్‌ఫోన్లు విస్తృతంగా వాడకంలోకి వచ్చాకే టీనేజ్ ప్రసవాల రేటు వేగంగా పడిపోయిందని ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం కెనడా, జపాన్, సింగపూర్, స్పెయిన్, చైనాతో పాటు మధ్య ఆదాయ దేశాలైన భారత్, బ్రెజిల్లలో కూడా జనాభా వృద్ధి రేటు వేగంగా క్షీణిస్తోంది. జనాభాను పెంచేందుకు జపాన్, సౌత్ కొరియా దేశాలు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నా ఫలితం దక్కడం లేదని ఈ అధ్యయనం పేర్కొంది. అయితే సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ఆర్థిక మాంద్యం, ఇతర గ్లోబల్ ఈవెంట్స్ కారణం అయినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో వచ్చిన 'స్మార్ట్‌ఫోన్ విప్లవం' (Technology Shock) మానవ సంబంధాలను, పుట్టుకల రేటును తీవ్రంగా ప్రభావితం చేసిందని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

Next Story