బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత అవసరం: బిహార్ సీఎం నితీశ్ కుమార్

by Disha Web Desk 21 |
బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత అవసరం: బిహార్ సీఎం నితీశ్ కుమార్
X

చండీగఢ్: 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. మాజీ ఉపప్రధాని దేవీ లాల్ 109వ జయంతి సందర్భంగా హర్యానాలోని ఫతేహబాద్‌లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నిర్వహించిన మెగా ర్యాలీలో ఆయన మాట్లాడారు. తాను ప్రధాని అభ్యర్థిని కాదని చెప్పారు. ప్రస్తుతానికి థర్డ్ ఫ్రంట్ ప్రసక్తే లేదని అన్నారు. కాషాయ పార్టీని దెబ్బ తీసేందుకు విపక్షాలతో ప్రధాన ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు వచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ముగింపు పలకాలని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విపక్షాలు ఏకతాటిపైకి రావడం తన కోరిక అని పేర్కొన్నారు.

2024లో ప్రభుత్వం మారుతుంది: శరద్ పవార్

2024 సాధారణ ఎన్నికల్లో దేశంలో ప్రభుత్వం మారబోతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. రైతులు ఆత్మహత్యలతో చావడంతో ఎలాంటి పరిష్కారం ఉండదని, ప్రభుత్వంలో మార్పు జరిగితేనే సంస్కరణ జరుగుతుందని చెప్పారు. రైతు నాయకులపై కేసులను వెనక్కి తీసుకుంటుందని కేంద్రం చెప్పినప్పటికీ, ఇప్పటివరకు నెవవేర్చలేకపోయిందని పేర్కొన్నారు.

దేశంలో ఎన్డీఏ లేదు: తేజస్వీ యాదవ్

రాష్ట్రీయ జనతా దళ్ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏనే లేదని అన్నారు. ఇప్పటికే జేడీ(యూ), ఆకాళీ దళ్, శివసేన వంటి పార్టీలు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాయని అన్నారు. బీజేపీ తన తప్పుడు ఆరోపణలు, అబద్దపు వాగ్దానాలతో అతిపెద్ద అబద్దాల పార్టీగా మారిందని విమర్శించారు. కాగా, 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన ఫ్రంట్ ను బలోపేతం చేసేందుకు విపక్షాలు ముందుకు రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో జేడీయూ నేత కేసీ త్యాగీ, ఆకాళీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్, సీతారాం ఏచూరి, తేజస్వి యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శివసేన నేత అరవింద్ సావంత్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరూ హజరుకాలేదు.



Next Story