- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేట్ నికోబార్ లో ఎయిర్‌పోర్ట్..రాహుల్ గాంధీ అభ్యంతరం
వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హిందూ మహాసముద్రంలో భారతదేశం మరో భారీ అడుగువేసింది.

గ్రేట్ నికోబార్ లో ఎయిర్‌పోర్ట్
- రూ.13వేల కోట్లతో నిర్మాణం
-చింగెన్ వద్ద సరికొత్త రన్ వే
దిశ, నేషనల్ బ్యూరో: వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హిందూ మహాసముద్రంలో భారతదేశం మరో భారీ అడుగువేసింది. గ్రేట్ నికోబార్ ద్వీపంలో రూ.13వేల కోట్లతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ సివిల్, మిలిటరీ విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న నౌకాదళ ఎయిర్‌ఫీల్డ్ ‘ఐఎన్ఎస్ బాజ్’ విస్తరణకు బదులుగా.. గలాథియా బే సమీపంలోని చింగెన్ వద్ద ఈ సరికొత్త రన్ వేను నిర్మించనున్నారు. మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉండే ఈ లొకేషన్ ద్వారా అండమాన్ నికోబార్ దీవుల్లో భారత సైనిక నిఘా సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న ‘ఐఎన్ఎస్ బాజ్’ రన్‌వేను విస్తరిస్తే అడవులు, వన్యప్రాణులతో పాటు స్థానిక గిరిజన గూడాలపై తీవ్ర ప్రభావం పడుతుందనే అధ్యయనాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో పూర్తి కానున్న ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ నౌకాదళ నియంత్రణలోనే ఉంటూ.. పౌర విమానయాన అవసరాలూ తీర్చనుంది.
రాహుల్ గాంధీ అభ్యంతరం
మొత్తం రూ. 81వేల కోట్ల వ్యయంతో కూడిన ఈ గ్రేట్ నికోబార్ మెగా డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై రాజకీయ వివాదం చెలరేగింది. ఇటీవల ఈ దీవుల్లో పర్యటించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల కోటిన్నరకు పైగా చెట్లు నరికివేతకు గురవుతాయని, పగడపు దిబ్బలు దెబ్బతింటాయని, అంతరించిపోతున్న ‘షోంపెన్’ గిరిజన తెగలు నిరాశ్రయులవుతారని, ఇది దేశ సహజ వారసత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు. కాగా, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా ఉనికికి అడ్డుకట్ట వేసేందుకు, అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో భారత్ వాటాను పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో వ్యూహాత్మకమైనదని కేంద్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.






