పెద్దల సభకు స్వాతి మలివాల్‌.. ఎవరామె ?

by Dishanational4 |
పెద్దల సభకు స్వాతి మలివాల్‌.. ఎవరామె ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ మహిళా కమిషన్‌(డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్‌ చేసింది. దీంతో ఆమె డీసీడబ్ల్యూ పదవికి రాజీనామా చేశారు. ఆప్‌కు చెందిన రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, సుశీల్ కుమార్ గుప్తాల పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలను రెండోసారి కూడా రాజ్యసభ సభ్యులుగా కొనసాగించాలని నిర్ణయించిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. సుశీల్ కుమార్ గుప్తా స్థానంలో స్వాతి మాలీవాల్‌కు రాజ్యసభ అవకాశం కల్పించారు. ఈ ఏడాది జరగనున్న హర్యానా ఎన్నికల్లో ఆప్ బాధ్యతలను సుశీల్ కుమార్ గుప్తాకు అప్పగించనున్నారని తెలుస్తోంది.

జైలులో ఉన్న సంజయ్ సింగ్‌‌కు..

ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఈమేరకు శుక్రవారం పార్టీ తరఫున రాజ్యసభ నామినేషన్లను ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే ఆప్ అభ్యర్థన మేరకు నామినేషన్ పత్రాలపై సంజయ్ సింగ్ సంతకం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యసభలో రాఘవ్ చద్దా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఆప్‌‌కు ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు. కాగా, ఢిల్లీలోని 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జనవరి 3న ప్రారంభమైంది. జనవరి 19న పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లలో 62 ఆప్‌కే ఉన్నందున అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.

Next Story

Most Viewed