యూపీలో ఘోరం.. చిరుత దాడిలో పదేళ్ల బాలుడు మృతి

by Dishafeatures2 |
యూపీలో ఘోరం.. చిరుత దాడిలో పదేళ్ల బాలుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని బల్రాంపూర్ లో ఘోరం జరిగింది. ఓ పదేళ్ల బాలుడిని చిరుత దాడి చేసి చంపేసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బల్రాంపూర్ జిల్లాలోని మజ్గవాన్ కు చెందిన సందీప్ (10) తన ఇంటి వెనుక భాగంలో ఆడుకోవడానికి వెళ్లాడు. కొంతసేపు తర్వాత కాస్త రిలీఫ్ తీసుకుందామని ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అయితే చెట్టు వెనుక భాగంలో ఉన్న చిరుత సందీప్ పై దాడి చేసి చంపేసింది. సందీప్ ను చిరుత లాక్కెళ్లడంతో సందీప్ భయంతో కేకలు వేశాడు. ఆ అరుపులు విన్న అతడి నానమ్మ బయటకి వచ్చి చూసే సరికి చిరుత ఆ బాలుడిని చెరుకు తోటలోకి లాక్కెళ్తోంది. వెంటనే ఆమె సాయం కోసం గట్టిగా కేకలు వేసింది.

దీంతో చిరుత అతడిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ సందీప్ చిరుత దాడిలో అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను వెంటనే పట్టుకోవాలని మెజిస్ట్రేట్ అటవీ అధికారులను ఆదేశించారు. దగ్గర్లోని సుహెల్వా వన్యప్రాణుల అభయారణ్యం నుంచి క్రూర జంతువులు తప్పించుకొని బయటకి వస్తాయని, కావున స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కోరాడు. స్థానికులు తమ పిల్లలను బయటతిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రిపూట ఇంటి చుట్టు పక్కల వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలని డీఎఫ్వో సేమ్ మారన్ గ్రామస్థులకు సూచించారు.




Next Story