పాల ట్యాంకర్​‌ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు..18 మంది స్పాట్ డెడ్

by vinod kumar |
పాల ట్యాంకర్​‌ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు..18 మంది స్పాట్ డెడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా..మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉన్నావ్ జిల్లా బంగార్‌మౌ ప్రాంతంలోని జోజికోట్ గ్రామ సమీపంలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బంగార్‌మావ్‌లోని సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బస్సు అతివేంగా వచ్చి పాల ట్యాంకర్‌ను ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రధాని మోడీ, రాష్ట్రపతి సంతాపం

ఉన్నావ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలా మంది మరణించారనే వార్త చాలా బాధాకరమైంది. ఆకస్మిక మరణానికి గురైన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

Next Story