దేశ వ్యాప్తంగా రోజూ 880 మంది మిస్సింగ్.. ఆ గ్యాంగుల పనేనా?

by Disha Web Desk 2 |
దేశ వ్యాప్తంగా రోజూ 880 మంది మిస్సింగ్.. ఆ గ్యాంగుల పనేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: 880... దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ నమోదవుతున్న మిస్సింగ్ కేసుల సంఖ్య ఇది.. దీంట్లో 350కి పైగా 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు సంబంధించిన ఫిర్యాదులే ఉంటున్నాయి. ఈ లెక్కన ఏటా దాదాపు 39 వేల మందికి పైగా చిన్నారులు కనిపించకుండా పోతున్నారు. ఇలా అదృశ్యమవుతున్న పిల్లల జాడ కనుక్కోవడానికి స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు ముస్కాన్ పేరిట సీఐడీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుతున్న పిల్లల సంఖ్య 20 వేలు మించడం లేదు. దీనిపై ఓ సీనియర్ పోలీస్ అధికారితో మాట్లాడగా ఆర్గనైజ్డ్ గ్యాంగుల కారణం గానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. దీనికి తోడు ఆయా రాష్ట్రాల పోలీసుల మధ్య సరైన సమన్వయం లేక పోవడంతోనూ కేసులు పరిష్కారం కావడం లేదన్నారు.

లెక్క లేనన్ని గ్యాంగులు

పోలీస్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చిన్న పిల్లలను టార్గెట్‌గా చేసుకొని పని చేస్తున్న గ్యాంగులు దేశంలో పదుల సంఖ్యలో ఉన్నాయి. గ్రామీణ, చిన్న పట్టణాలను టార్గెట్‌గా చేసుకొని ఈ ముఠాలు చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాయి. కొన్నిసార్లు 'మీ నాన్న నాకు ఫ్రెండే అని.. ఇంకొన్ని సార్లు చాక్లెట్లు.. బొమ్మలు కావాలా..' అంటూ ఆశ చూపించి ముఠా సభ్యులు పిల్లలను అపహరిస్తున్నారు. కిడ్నాప్ చేసిన పిల్లలను ముఠా సభ్యులు వెంటనే రాష్ట్రాలు దాటిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఓ నలుగురైదుగురు పిల్లలను అపహరిస్తే ముంబై, బెంగుళూరు, కోల్‌కత వంటి సిటీలకు తీసుకెళుతున్నారు.

అంగట్లో సరుకులా...

ఇలా తీసుకెళ్లిన పిల్లలను బెగ్గింగ్ మాఫియా లేదా డ్రగ్స్ మాఫియా గ్యాంగులకు అమ్మేస్తున్నారు. 13 సంవత్సరాలకు మించి వయసున్న ఆడపిల్లలను వ్యభిచార కొంపలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రతి రోజూ నరకమే...

అప్పటి నుంచి ఈ పిల్లలకు ప్రతిరోజూ నరకమే. మగ పిల్లలతో బస్ స్టాండ్లు... రైల్వే స్టేషన్లు... ప్రార్థనా మందిరాలు... బిజీగా ఉండే మార్కెట్లలో భిక్షాటన చేయిస్తున్నారు. డబ్బులు ఎక్కువగా వస్తాయని కొంత మంది పిల్లలను వికలాంగులుగా మారుస్తున్నారు. కాస్త చురుగ్గా ఉన్న పిల్లలను దొంగలుగా మారుస్తున్నారు. చెప్పినట్టు వినకపోతే చిత్ర హింసలు పెడుతున్నారు. ఉదయం, రాత్రికి పిడికెడంత అన్నం పెట్టి పిల్లలను జీవచ్ఛవాలుగా మారుస్తున్నారు. పిల్లలు తమ వద్ద నుంచి వెళ్లిపోకుండా, చెప్పినట్టు వినేలా వారికి గంజాయి వంటి మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నారు. ఇక ఇలాంటి గ్యాంగుల చేతుల్లో పడి వ్యభిచారగృహాలకు చేరుతున్న మైనర్ బాలికల బాధ మాటల్లో చెప్పలేం. తమపై జరిగే దాష్టికాలను భరించలేక.. బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిత్యం నరకం చూస్తున్నారు.

పట్టింపే ఉండదు...

చిన్న పిల్లల మిస్సింగ్ కేసులను పోలీసులు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తొమ్మిదేళ్ల క్రితం మిస్సింగ్ ఫిర్యాదులకు సంబంధించి ఐపీసీలో ఎలాంటి సెక్షన్ లేకపోవడం. బాలుడు కనిపించకుండా పోతే బాయ్ మిస్సింగ్ అని.. ఆడపిల్లయితే గర్ల్ మిస్సింగ్ అని ఎఫ్ఐఆర్ జారీ చేసేవారు. మైనారిటీ తీరిన వారైతే ఉమెన్ మిస్సింగ్, మ్యాన్ మిస్సింగ్ అని కేసులు రిజిస్టర్ అయ్యేది. ఇక నెలలు గడిచినా ఈ కేసులకు మోక్షం లభించేది కాదు. అయిన వాళ్ల జాడ తెలియక పుట్టెడు శోకంతో పోలీస్ స్టేషన్లకు వస్తే ఇంతకన్నా ముఖ్యమైన కేసులు ఎన్నో ఉన్నాయి... పదే పదే తమవద్దకు రావొద్దని కసురుకొని పంపించేవారు.

2014 తరువాత...

అయితే, 2014 తరువాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. దీనికి కారణం ఘజియాబాద్ పోలీసులు అప్పట్లో ఆపరేషన్ ముస్కాన్ పేర స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 300 మంది పిల్లలను రక్షించడమే. ఇలా కాపాడిన పిల్లల్లో చాలా మందిని వారి వారి తల్లిదండ్రుల ఒడికి చేర్చడమే. ఘజియాబాద్ పోలీసులు ముస్కాన్ పేర నిర్వహించిన ఈ డ్రైవ్ దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రతి రాష్ట్రంలో ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పరచి ఇలాంటి డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర సీఐడీ విభాగంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని సభ్యులకు రెస్క్యూ ఆపరేషన్ సమయంలో పిల్లలతో ఎలా మాట్లాడాలి.. ఎలా వ్యవహరించాలి అన్న దానిపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ బృందం ఆపరేషన్ ముస్కాన్ పేర ప్రతి ఆరు నెలల కొకసారి డ్రైవ్ నిర్వహిస్తూ పిల్లలను కాపాడతూ వస్తోంది.

తాజాగా...

తాజాగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో పోలీసులు 2,814 మంది చిన్నారులను రక్షించారు. వీరిలో 872 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉండడంతో అక్కడి పోలీసులను సమన్వయం చేసుకొని వారి ఇళ్లకు పంపించారు. ఈ పిల్లలతో ఊడిగం చేయించుకుంటున్న వారితో పాటు మొత్తం 403 మందిని అరెస్టు చేసారు. అయితే ఆరు నెలలకు ఒకసారి కాకుండా తరచూ ఇలాంటి డ్రైవ్‌లు నిర్వహిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని పోలీస్ వర్గాలే అంటున్నాయి. దాంతో పాటు పిల్లలతో చాకిరీ చేయించుకునే వారిని కాకుండా బెగ్గింగ్... డ్రగ్స్ మాఫియాలను ఉక్కుపాదంతో అణచివేస్తే ఈ తరహా నేరాలకు కళ్లెం వేయొచ్చని చెబుతున్నాయి.

ఈ గోస ఎవరికీ రావొద్దు...

ఏం చెప్పమంటారు సార్.. నా బిడ్డ కనిపించకుండా పోయి పదకొండేళ్లు దాటింది... పోలీసోళ్ల చుట్టూ తిరిగినం... అన్ని చోట్లా వెతికినం... బిడ్డ మాత్రం దొరకలేదు... ఇదీ ఛత్రినాక ప్రాంతంలో నివాసముంటున్న వెంకటేశ్, స్వాతి దంపతుల ఆవేదన. శుభకార్యాల్లో వంటలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకటేశ్ దంపతుల పెద్ద కుమారుడు ఆదిత్య. 2012లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆదిత్యను దుండగులు ఎత్తుకెళ్లారు. కొడుకు కనిపించడం లేదని కొద్దిసేపు తరువాత గమనించిన స్వాతి కంగారుగా ఇంటి చుట్టుపక్కల మొత్తం వెతికింది. అయినా బిడ్డ దొరకక పోవడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ వెంటనే ఇంటికి చేరుకున్న వెంకటేశ్ మరోసారి స్నేహితులతో కలిసి బస్తీ మొత్తం గాలించాడు. ఎక్కడా ఆచూకీ దొరకకపోవటంతో ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో సొంత ఖర్చుతో పోస్టర్లు ప్రింట్ చేయించి స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అతికించాడు. తన బిడ్డ ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అయినా ఆదిత్య దొరకలేదు. రెండు మూడేళ్లపాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎలాంటి సమాచారం లేక దేవునిపై భారం వేసి బతుకుతున్నారు.


Next Story

Most Viewed