ఏడు కోట్లమంది గ్రామీణులకు పైపుల ద్వారా నీటి కనెక్షన్: ప్రధాని

by Dishanational4 |
ఏడు కోట్లమంది గ్రామీణులకు పైపుల ద్వారా నీటి కనెక్షన్: ప్రధాని
X

పనాజీ: స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ 3 కోట్లమంది గ్రామీణులకు మాత్రమే పైపుల ద్వారా నీటి కనెక్షన్ సౌకర్యం అందించారని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పైపుల ద్వారా వాటర్ కనెక్షన్ ప్రకటించిన తర్వాత గత మూడేళ్లలో ఏడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు టాప్ వాటర్ సౌకర్యాన్ని అందించామని పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వ ప్రకటించిన జల్ జీవన్ మిషన్ కింద గత మూడేళ్లలో ఏడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించామని, ఇంతవరకు పది కోట్ల గ్రామీణ కుటుంబాలకు వైపుల ద్వారా వాటర్ కనెక్షన్ సౌకర్యం కల్పించగలిగామని ప్రధాని తెలిపారు. గోవాలో గ్రామీణప్రాంతాల్లో నూటికి నూరు శాతం పైపుల ద్వారా నీటి సరఫరా కల్పించిన సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో లింకు ద్వారా ప్రధాని శుక్రవారం ప్రసంగించారు. గోవా రాజధాని పనాజిలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హాజరయ్యారు.

మూడేళ్లలో పది కోట్ల గ్రామీణ కుటుంబాలకు వైపుల ద్వారా నీటి కనెక్షన్లు అందించాలనే మైలు రాయిని అధిగమించామని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. తాను మూడేళ్ల క్రితం జల్ జీవన్ మిషన్ ప్రకటించినప్పుడు ఇతర నీటి వనరులపై 16కోట్ల పైగా గ్రామీణ కుటుంబాలు ఆధారపడి ఉండేవారని ప్రధాని గుర్తు చేశారు. ఇన్ని కోట్లమంది జనాభా నీటికోసం పోరాడటాన్ని చూస్తూ ఊరకుండలేకపోయామని చెప్పారు. ప్రజలు, భాగస్వాముల ప్రోత్సాహం, రాజకీయ సంకల్పం, వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారానే జల్ జీవన్ మిషన్ విజయవంతమైందని ప్రధాని పేర్కొన్నారు.

జాతి గురించి పట్టించుకోనివారూ విమర్శించడమే.. ప్రధాని ఎద్దేవా

దేశం గురించి ఏమాత్రం పట్టించుకోనివారు జాతి ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఏర్పర్చడం సులభమే కానీ బీజేపీ జాతి నిర్మాణాన్ని ఎంచుకుందని, ఇది చాలా కష్టంతో కూడుకున్నదని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పర్చడం పెద్ద కష్టం కాదు. కానీ దేశాన్ని నిర్మించాలంటే కఠిన శ్రమ తప్పనిసరి అని మోడీ అభిప్రాయపడ్డారు.

గత ఎనిమిదేళ్ల పాలనలో జాతి నిర్మాణ పంధాను తామెంచుకున్నామని, వర్తమానంలో, భవిష్యత్తులో కూడా ఎదురయ్యే సమస్యల పరిష్కారంవైపుగా తాము నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని చెప్పారు. తాగు నీటి సౌకర్యం గురించి ప్రతిపక్షాలు గొప్ప గొప్ప వాగ్దానాలు చేయవచ్చు కానీ ఒక దార్శనికతతో ఆ వైపుగా వీరు ఎన్నడూ కృషి చేయలేదని ఎద్దేవా చేశారు.


Next Story

Most Viewed