కువైట్‌లో తీవ్ర విషాదం.. పొట్టకూటి కోసం వెళ్లిన 40 మంది భారతీయులు మృతి

by Harish |   ( Updated:2024-06-12 14:03:04.0  )
కువైట్‌లో తీవ్ర విషాదం.. పొట్టకూటి కోసం వెళ్లిన 40 మంది భారతీయులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అరబ్ దేశం అయినటువంటి కువైట్‌లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పొట్టకూటి కోసం భారత్ నుంచి వెళ్లిన వారు నిద్రలోనే తుది శ్వాస విడిచారు. దక్షిణ మంగాఫ్ జిల్లాలో వలస కార్మికులు నివాసం ఉంటున్న ఆరు అంతస్తుల భవనంలో ఉదయం మంటలు చెలరేగడంతో 49 మంది చనిపోగా వారిలో 40 మంది భారతీయులే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ ఘటనలో 50 మందికి పైగా గాయాల పాలు కాగా, వారిలో 30 మందికి పైగా భారతీయులే ఉన్నారు.

తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో వంటగదిలో మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే అవి భవనమంత వ్యాపించాయి. లోపల కార్మికులు నిద్రలో ఉండటంతో మంటలను పసిగట్టలేకపోయారు. దీంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. భవనంలో దాదాపు 160 మంది వ్యక్తులు ఉన్నారు. వారిలో చాలా మంది కార్మికులు భారతదేశానికి చెందినవారు. ఎక్కువ మంది కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు. ఈ ప్రమాదంలో 35 మంది మంటల్లో కాలిపోగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి వయస్సు 20 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ భవనం కువైట్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందింది. స్థానిక అధికారి మీడియాతో మాట్లాడుతూ, భవనంలోని కార్మికులు నిద్రలో ఉండడం వలన మంటలు వ్యాపించిన వెంటనే తప్పించుకోడానికి వీలు లేకుండా ఉండడంతో పాటు, దురదృష్టవశాత్తు మంటల నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల చాలా మంది మరణించారని తెలిపారు.

ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.''కువైట్ సిటీలో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరం. నా ఆలోచనలు వారి బంధువులను, ప్రియమైన వారిని కోల్పోయిన వారందరిపై ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది, బాధితులకు సహాయం చేయడానికి అక్కడి అధికారులతో కలిసి పని చేస్తోందని'' మోడీ అన్నారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో సంబంధిత అందరికీ మా రాయబార కార్యాలయం పూర్తి సహాయాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. గాయపడిన భారతీయులు చికిత్స పొందుతున్న అల్-అదాన్ ఆసుపత్రిని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా సందర్శించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరింత సమాచారం కోసం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది: +965-65505246 ఈ నెంబర్‌లో సంప్రదించాలని కోరింది.

కువైట్ డిప్యూటీ ప్రధాని ఫహద్ యూసుఫ్ అల్-సబా ఘటనా స్థలాన్ని సందర్శించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీసు విచారణకు ఆదేశించారు. విచారణ ముగిసే వరకు భవనం యజమాని, దాని కాపలాదారును అదుపులోకి తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా నివాస భవనాలలో తనిఖీలు చేయాలని, నిబంధనలు ఉల్లఘించిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కువైట్ మునిసిపాలిటీ అధికారులను ఆయన ఆదేశించారు.

అగ్నిప్రమాదంలో గాయపడిన భారతీయులకు సహాయం చేయడానికి, మృత దేహాలను స్వదేశానికి రప్పించడానికి ప్రధాని మెడీ ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్‌కు అత్యవసరంగా పయనమైనట్లు MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed