- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌ను తనిఖీ చేద్దామని మూత తెరిచిన ఓ కుటుంబానికి.. అందులో ఏకంగా 27 పాములు కనిపించడంతో వారు భయంతో వణికిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భయాందోళనలో కుటుంబ సభ్యులు..
స్థానిక నివేదికల ప్రకారం.. హరిద్వార్‌లోని సరాయ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం రోజువారీ తనిఖీల్లో భాగంగా తమ అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌ను పరిశీలించారు. లోపల నీటిలో ఏదో కదులుతున్నట్లు గమనించి తీక్షణంగా చూడగా.. ఒకదానిపై ఒకటి మెలికలు తిరుగుతూ పదుల సంఖ్యలో పాము పిల్లలు కనిపించాయి. వాటర్ ట్యాంకులో అన్ని పాములను ఒక్కసారిగా చూసిన ఆ కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ భయానక, అరుదైన ఘటనను చూసేందుకు గ్రామస్థులు భారీగా అక్కడికి చేరుకున్నారు.
సురక్షితంగా బయటకు తీసిన అటవీ సిబ్బంది..
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు, స్నేక్ క్యాచర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, ట్యాంకులో ఉన్న పాములను అత్యంత చాకచక్యంగా, సురక్షితంగా బయటకు తీశారు. ట్యాంక్ నుంచి మొత్తం 27 పాము పిల్లలను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం వాటిని సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నిపుణుల సూచనలు..
ఈ పాములన్నీ ‘ఆసియాటిక్ వాటర్ స్నేక్’ జాతికి చెందినవని స్నేక్ క్యాచర్లు తెలిపారు. ఇవి భారతదేశంలో సాధారణంగా కనిపించే నీటి పాములని వారు పేర్కొన్నారు. వర్షాకాలం, ఉక్కబోత వాతావరణంలో చల్లదనం, ఆశ్రయం కోసం పాములు ఇలా ఇళ్లలోనికి, వాటర్ ట్యాంకుల్లోకి, స్టోర్ రూముల్లోకి వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. వానాకాలంలో ప్రజలు తమ ఇళ్లు, పరిసరాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.






