సమ్మెకు సిద్ధంగా 2 లక్షల మంది కాంట్రాక్టర్లు.. ప్రాజెక్టులపై ప్రభావం

by Disha Web Desk 17 |
సమ్మెకు సిద్ధంగా 2 లక్షల మంది కాంట్రాక్టర్లు.. ప్రాజెక్టులపై ప్రభావం
X

ముంబై: మహారాష్ట్రలోని 2 లక్షల మంది కాంట్రాక్టర్లు ఈ నెల 27 నుంచి సమ్మెకు దిగనున్నారు. దీపావళికి ముందు వరకు గ్రామీణాభివృద్ధి, జలవనరులు, జలసంరక్షణ శాఖల కింద జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మూడు లేఖలను పంపామని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు మిలింద్ భోసలే ఓ ప్రకటనలో తెలిపారు.

కానీ, దీపావళికి ముందు మహారాష్ట్ర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నవంబర్ 26వ తేదీలోగా బిల్లులు మంజూరు కాకపోతే రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని నిలిపివేసి మరుసటి రోజు నుంచి సమ్మెకు దిగుతామని మిలింద్ స్పష్టం చేశారు.

పెండింగ్‌లో ఉన్న వాటిలో అత్యధికంగా కొత్త రోడ్లు, మరమ్మతులకు సంబంధించి రూ. 6,500 కోట్లు, ఇతర నిర్మాణ, మరమ్మతులు రూ. 1,700 కోట్లు సహా మొత్తం రూ. 10 వేల కోట్ల వరకు ఉన్నాయని ఆయన తెలిపారు. పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించడమే కాకుండా పలు డిమాండ్లను కాంట్రాక్టర్ల సంఘం ప్రభుత్వానికి అందజేసింది. కాగా, కాంట్రాక్టర్లందరూ సమ్మెకు దిగితే రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Next Story