18వ లోక్‌సభ.. తొలిరోజు విశేషాల సమాహారం ఇదీ

by Hajipasha |
18వ లోక్‌సభ.. తొలిరోజు విశేషాల సమాహారం ఇదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలుత లోక్‌సభాపక్ష నేతగా, ఎంపీగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. పోడియం వద్దకు మోడీ వెళ్లగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా మోడీ, మోడీ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోడీ అనంతరం కేంద్రమంత్రులతో ప్రొటెం స్పీకర్‌ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. తొలుత ఏపీ ఎంపీలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లభించింది. ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్‌, మతుకుమిల్లి శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగులో ప్రమాణం చేశారు. మిగతావారు హిందీ, ఇంగ్లీష్‌లలో ప్రమాణం చేశారు. తెలుగులో ప్రమాణం చేసిన కేంద్రమంత్రులలో కింజరాపు రామ్మోహన్‌నాయుడు(టీడీపీ), కిషన్​ రెడ్డి(బీజేపీ), బండి సంజయ్‌(బీజేపీ), పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ), భూపతిరాజు శ్రీనివాసవర్మ (బీజేపీ) ఉన్నారు.

పంచెకట్టులో కిషన్‌ రెడ్డి, అప్పలనాయుడు..

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో తొలిరోజు సభకు హాజరయ్యారు. ఇక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. రాజస్థాన్‌లోని సికార్‌ స్థానానికి చెందిన సీపీఎం ఎంపీ అమ్రా రామ్ ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంటు దాకా వచ్చారు. అయితే ఆయనను ట్రాక్టరుతో లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన పార్లమెంటు గేటు వద్ద నుంచి లోపలికి నడుచుకుంటూ చేరుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు ‘నీట్‌.. నీట్‌.. నీట్‌..’ అంటూ నినాదాలు చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల వ్యవహారంపై ఈవిధంగా విపక్ష సభ్యులు తమ నిరసనను లోక్‌సభ వేదికగా వ్యక్తపరిచారు. సోమవారం రోజు మొత్తం మీద ప్రధాని మోడీ సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. మంగళవారం రోజు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా, లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్య 543.

ప్రొటెం స్పీకర్​గా భర్తృహరి మహతాబ్ ప్రమాణం

అంతకుముందు సోమవారం ఉదయాన్నే లోక్‌సభ ప్రొటెం స్పీకర్​గా భర్తృహరి మహతాబ్​‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన వెళ్లి లోక్‌సభ సెషన్‌ను ప్రారంభించి, ఎంపీలతో ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ పదవి​ అనేది భారత పార్లమెంట్​ చరిత్రలో ఎన్నడూ సమస్య కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్​ రిజిజు అన్నారు. ఆయన బాధ్యత కేవలం కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించడం, కొత్త స్పీకర్​ ఎన్నికలో సహాయం అందించడం మాత్రమేనన్నారు. చాలా విపక్ష పార్టీల నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన చెప్పారు.

రాహుల్‌ రాజీనామా ఆమోదం

లోక్‌సభ ప్రారంభం కాగానే కేరళలోని వయనాడ్‌ స్థానానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన రాజీనామాను ప్రొటెం స్పీకర్‌ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల్లోనూ రాహుల్ గెలిచారు. ఉత్తరాది రాజకీయాలపై ఫోకస్ చేయాలని భావిస్తున్న రాహుల్ గాంధీ.. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగనున్నారు.

తదుపరిగా జరిగేవి ఇవే..

మంగళవారం రోజు లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం ముగియగానే స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ ఘట్టం మొదలవుతుంది. ఈనెల 26న స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. 27వ తేదీన రాజ్యసభ సెషన్ కూడా ప్రారంభం కానుంది. అదే రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఈనెల 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంది. జులై 2 లేదా 3న ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్చకు బదులిచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed