ఇదే మంచి తరుణం.. వారిని ఒంటరి చేయండి

by  |
ఇదే మంచి తరుణం.. వారిని ఒంటరి చేయండి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను ఒంటరి చేయాలన్న ఎత్తుగడలో జాతీయ కార్మిక సంఘాలు ఉన్నాయా..! అంటే కార్మిక వర్గాల్లో నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. అలాగే కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై సింగరేణిలో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇప్పుడు అందరూ ఏకమైతే టీబీజీకేఎస్‌కు చెక్ పెట్టవచ్చన్న ఆలోచన వివిధ సింగరేణి కార్మిక సంఘాల నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో టీబీజీకేఎస్ ను అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని సమాచారం. ఇందుకు వివిధ పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలన్నీ ఐక్యంగా ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓట్ల చీలిక మంత్రాన్ని బలంగా నమ్మే టిఆర్ఎస్ కు ఆ అవకాశం ఇవ్వకుండా అన్ని డివిజన్లలో ఆయా సంఘాలు ఐక్యంగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇదే మంచి సమయం

సింగరేణిలో వెంటనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా సింగరేణిలో బలమైన పట్టు ఉన్న ఏఐటీయూసీ తో పాటు ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఎస్‌డబ్ల్యూ‌ఎఫ్ కార్మిక సంఘాలు ఇప్పుడు ఏకతాటి పైకి వచ్చే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ సంఘాలన్నీ కార్మికులను ఏకం చేస్తున్నాయి. గత పక్షం రోజుల క్రితం మూడు రోజులపాటు బొగ్గు గనుల్లో సమ్మెకు దిగిన జాతీయ సంఘాలు సింగరేణిలో వ్యూహాత్మకంగా ఒక్కటయ్యాయి. ఒక్కరోజు మాత్రమే సమ్మెలో పాల్గొన్న టీబీజీకేఎస్ సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్ర చేసిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కార్మిక వర్గాల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. మరోవైపు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ఇప్పటివరకు టీబీజీకేఎస్ హామీని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేదు.

రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత

మరోవైపు తెలంగాణలో ఉన్న సింగరేణి కార్మిక క్షేత్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత కూడా ఉంది. కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం అనుకూలంగా ఉందన్న ప్రచారాన్ని జాతీయ సంఘాలు కార్మికుల్లోకి తీసుకు వెళ్లాయి. మరోవైపు టీబీజీకేఎస్‌లో బలమైన చీలిక వచ్చింది. కార్మికుల్లో మంచి పట్టు ఉన్న కెంగర్ల మల్లయ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్మికులు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ బీఎంఎస్‌లో చేరారు. ఇది టీబీజీకేఎస్‌కు పెద్ద దెబ్బగా మారింది. ఒక సందర్భంలో టీబీజీకేఎస్ కు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎంపీ కవిత సింగరేణి వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. దీనిపై కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం కూడా ఉంది. వారి అవకాశాల కోసం తమను పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ సింగరేణి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కార్మిక సంఘాల నేతలను ఆమె పిలిచి మాట్లాడటం కూడా చర్చనీయాంశం అయింది. వారి అవసరాల కోసమే తమను పావుగా వాడుకుంటున్నారని కార్మికుల్లో తీవ్రంగా ప్రచారం చేయడంలో జాతీయ సంఘాలు కొంతమేర పైచేయి సాధించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఇప్పుడే నిర్వహించాలని జాతీయ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన నేతలు

సింగరేణిలో తమ అనుబంధ పార్టీల తో సంబంధం లేకుండా వివిధ జాతీయ సంఘాల నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వెంటనే ఎన్నికలు జరిపేలా కార్మిక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరడం గమనార్హం. దీనిపై కిషన్ రెడ్డి కూడా కార్మిక సంఘాల నేతలతో చాలాసేపు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వెంటనే ఎన్నికలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ను ఒంటరి చేయవచ్చన్న అభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా కార్మిక నేతలు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తాజా పరిణామాలు సింగరేణిలో అనూహ్యంగా వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

Next Story