నల్సా’పై ఆరు వారాల క్యాంపెయిన్.. ఎక్కడంటే ?

by  |
నల్సా’పై ఆరు వారాల క్యాంపెయిన్.. ఎక్కడంటే ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చైర్మన్‌గా, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) అవగాహనా కార్యక్రమం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శనివారం ప్రారంభం కానున్నది. గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజు వరకు ఆరు వారాల పాటు (45 రోజులు) కొనసాగనున్నది. దేశంలో న్యాయ ప్రాధికార సంస్థలు ఎలా పనిచేస్తాయో, వాటి సేవలను ఎలా పొందాలో, ఉచిత న్యాయ సలహాలను ఎలా అందుబాటులోకి తెచ్చుకోవచ్చో గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్‌ను చేపట్టనున్నట్లు నల్సా సభ్య కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా లీగల్ సర్వీసెస్ సంస్థలకు చెందినవారు గ్రామాల్లో పర్యటిస్తారని, మొత్తం ఆరున్నర లక్షల గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశంలోని 4,100 మున్సిపల్ పట్టణాలు కూడా ఈ క్యాంపెయిన్‌లో కవర్ అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన న్యాయ సంస్థల వాలంటీర్లకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.


Next Story

Most Viewed