పీఎల్ఐ స్కీంతో ఐదేళ్లలో రూ.38 లక్షల కోట్లకు చేరనున్న ప్రొడక్షన్

by  |
పీఎల్ఐ స్కీంతో ఐదేళ్లలో రూ.38 లక్షల కోట్లకు చేరనున్న ప్రొడక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ తయారీ, ఎగుమతులను పెంచే లక్ష్యంతో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం రాబోయే ఐదేళ్లలో దేశ ఉత్పత్తిని సుమారు రూ. 38 లక్షల కోట్లకు పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం నీతి ఆయోగ్, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీఎల్ఐ పథకంపై నిర్వహించిన వెబ్‌నార్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం నిరంతరం సంస్కరణలు చేస్తోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో పీఎల్ఐ పథకానికి రాబోయే ఐదేళ్లకు సుమారు రూ. 2 లక్షల కోట్లను కేటాయించామని, ఈ పథకం ఐదేళ్లలో ఉత్పత్తి రూ. 38 లక్షల కోట్లకు పెరుగుతుందనే అంచనా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పీఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందే రంగాల్లో ప్రస్తుతం ఉన్న శ్రామిక శక్తి రెట్టింపు అవుతుందని, ఉద్యోగ కల్పనలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. అనుమతుల భారాన్ని తగ్గించేందుకు, సులభతర వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు, పరిశ్రమల లాజిస్టిక్ ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘పీఎల్ఐ పథకం టెలికాం నుంచి ఆటో, ఫార్మా రంగాల వరకు అన్నిట్లోనూ తయారీని పెంచుతుంది. ఈ పథకం లక్ష్యం తయారీని విస్తరించడం, ఎగుమతులను పెంచడమని’ మోదీ వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed