సాగర్-శ్రీశైలం: లాంచీలో కృష్ణమ్మ అందాల కనువిందు

by Shyam |
Nagarjunasagar - Srisailam, Shipping
X

దిశ, నాగార్జునసాగర్: ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పుష్కలంగా కురవడం వల్ల అల్మటి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ అన్ని ప్రాజెక్టులూ నిండకుండల్లా మారాయి. దీంతో నదిలో బోటు ప్రయాణానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

నాగార్జునసాగర్‌లో 590 అడుగుల నీటిమట్టం

అలలపై నుంచి నల్లమల అందాలను తిలకిస్తూ యాత్ర పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 590 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీన హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నట్లు అధికారుల తెలిపారు. రెండ్రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు, జింకలు, దుప్పుల పరుగులు, నదికి ఇరువైపులా నల్లమల అందాల నడుమ అలలపై లాంచీ ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతులు పంచనుంది. ప్రతి వారంతపు శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ లాంచీ ప్రయాణం ఆదివారం సాయంత్రం తిరిగి నాగార్జునసాగర్‌కు చేరుకుంటుంది. ఈ రెండ్రోజుల ప్రయాణంలో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. అదేవిధంగా పర్యాటకులకు మల్లన్న దర్శనాన్ని, బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. నందికొండ నుంచి శ్రీశైలంకు కొనసాగే ఈ రెండు రోజుల ప్రయాణం తీరం వెంబడి వున్న అమ్రాబాద్ నల్లమల్ల అడువుల ప్రకృతి సహజ అందాలు పర్యాటకుల మనస్సులను ఇట్టే కట్టి పడేస్తాయి.

కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయాణంలో చాకలిగట్టు సమీపించగానే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి. గౌతమ బుద్దుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంగా సాగుతూ కొద్ది ప్రయాణంలోనే పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమిస్తుంది. ఈ ప్రయాణంలో చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు, మొసళ్లు, అందమైన పర్వతాలు ముందుకు వెళ్లే కొద్దీ చూడ ముచ్చటైన అందాలు కనివిందు చేస్తూనే ఉంటాయి. సాయంత్రానికి లింగాల గట్టు చేరుకుంటుంది. ఆ తర్వాత పర్యాటకులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఆదివారం సాయంత్రానికి లాంచీలో నందికొండ చేరుకుంటారు. నది కొండల మధ్య బోటులో ప్రయాణం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్యాటక ప్రాంతం నాగార్జునసాగర్ అయితే ఇప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు బోటు ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో అంతులేని ఆనందాన్ని అందిస్తోంది. ఆహ్లాదకరమైన నల్లమల అడవి దృశ్యాలతో పాటు ఆధ్యాత్మికమైన వాతావరణం మధ్య ప్రయాణం హాయిగా సాగిపోతుంది. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను మిగులుస్తుందంటున్నారు పర్యాటకులు.

నాగార్జునసాగర్ నుండి దాదాపు ఏడు గంటల పాటు ప్రయాణం(జర్నీ) మొదలౌతుంది. ఏడు గంటల పాటు సాగే ఈ జర్నీలో పక్షుల కిలకిలారావాలతో నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ పచ్చటి కొండల చుట్టూ తిరుగుతు ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రయాణం పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మపై పకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఎంతో బాగుంటుంది. సాగర్ నుండి మొదలై శ్రీశైలం వరకు సాగే ఈ ప్రయాణంలో మనకు తెలియని ఎన్నో కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు ఇక్కడ ఓ గైడ్ కూడా ఉంటాడు. అతను ప్రతీ ప్రదేశం ప్రత్యేకతను పర్యాటకులకు వివరిస్తుంటాడు. ఇక కృష్ణానదిలో బోటు ప్రయాణం చేసినంత సేపూ మనకు ఇంకేం గుర్తుండదు. ఏ టెన్షన్స్ కూడా మన దరిచేరవు. అలా ఉంటుంది వాతావరణం. ఆ మనోహరమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి మనసు ఆనందతాండవం చేస్తుంది. కృష్ణా నదిలో దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత శ్రీశైలానికి బోటు చేరుకుంటుంది. సాగర్ జలాశయం నుంచి శనివారం ఉదయం 9.30 గంటలకు సాగర్‌ హిల్‌ కాలనీ నుంచి తొలి ప్రయాణం సాయంత్రం 3గంటలకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని చేరుకుంటుంది.

లాంచీ ప్రయాణ రేట్లు

హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ చేరుకొని హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.3,999, పిల్లలకు రూ.3,200లుగా టూరిజం శాఖ వారు నిర్ణయించారు. నాగార్జునసాగర్ నుండి వన్ వే పెద్దలకు రూ.1499, పిల్లలకు 1199లుగా టికెట్ రేటు నిర్ణయించారు. తిరిగి మరలా వారంతపు శనివారం 28వ తేదీన శ్రీశైలం లాంచీ ట్రిప్పును ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. లాంచీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు, టికెట్ ధరలను అన్‌లైన్‌లో పొందవచ్చునని తెలిపారు. మరింత సమాచారం కోసం సంప్రదించండి ఫొన్ నెంబర్ 9848540371,7997951023 అందుబాటులో ఉంచారు.

Next Story

Most Viewed