టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల మృతి

by  |
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల మృతి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ‌ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గతకొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. నర్సింహాయ్య యువకుడిగా ఉన్న సమయంలోనే మెదడులో కణితి ఏర్పడింది. ఆ కణితికి సంబంధించి శస్త్రచికిత్స చేసుకునేందుకు విదేశాలకు సైతం వెళ్లారు. అయితే కణితికి సంబంధించి శస్త్రచికిత్స చేస్తే మెదడుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండడంతో ఆపరేషన్ చేయించుకోలేదు. దీంతో ఆ కణితి అలాగే ఉండిపోయింది.

నోముల నర్సింహాయ్య ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు విదేశాల్లో ఉంటుండగా, కొడుకు భగత్ నల్లగొండలో న్యాయవాదిగా పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. నోముల మరణవార్త తెలుసుకున్న బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటని చెప్పొచ్చు. నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. పేదలకు సమస్యంటే ముందుండే నర్సింహాయ్య లేకపోవడాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నారు.

రాజకీయ ప్రస్థానమిదీ..

1956 జనవరి 9న జాజిరెడ్డిగూడెంలో నోముల నర్సింహాయ్య జన్మించారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకుని పలు విద్యార్థి సంఘాల్లో పనిచేశారు. కమ్యూనిస్టు భావజాలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటగా నకిరేకల్ సమితి ప్రెసిడెంట్‌గా గెలిచారు. అనంతరం సీనియర్ కమ్యూనిస్టు ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వారసుడిగా నకిరేకల్ ఎమ్మెల్యేగా వరుసగా గెలిచారు. 1999, 2004లో సీపీఎం తరపున నకిరేకల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణమాల నేపథ్యంలో 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కందూరు జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2018 ఎన్నికల్లో అదే జానారెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచారు.

Next Story

Most Viewed