ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్ వర్చువల్ వార్

by  |
ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్ వర్చువల్ వార్
X

దిశ, వెబ్‌డెస్క్ :
సోషల్ మీడియా, యూట్యూబ్ చానెళ్లలో టెక్నాలజీపై, మార్కెట్‌లో వస్తున్న కొత్త గాడ్జెట్లపై చాలా మంది విశ్లేషణలు చేస్తుంటారు. వాటి పనితీరు, అదే ధరలో వచ్చే మరో బెస్ట్ ప్రొడక్ట్ ఏంటి? దానికి, దీనికి గల వ్యత్యాసాలేంటి? అనే విషయాలను పోల్చి చెబుతారు. ప్రస్తుతం ఇలాంటి రివ్యూలు చాలా కామన్‌గా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఐఫోన్, ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ల పనితీరుపై ఓ నెటిజన్ రివ్యూ చేశాడు. అందులో ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ వేగంగా పనిచేయగా, ఐఫోన్ కాస్త వెనకబడినట్లయింది. ఇది కాస్తా ఐఫోన్ ఫ్యాన్స్, ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వర్చువల్ వార్‌కు దారితీసింది.

సాధారణంగా ఐఫోన్ వినియోగదారులు.. తమ గాడ్జెట్‌తో చాలా సంతృప్తిగా ఉంటారు. అన్ని మొబైల్స్‌తో పోల్చితే.. తమదే టాప్ బ్రాండ్ అని నమ్ముతుంటారు. అయితే, ట్విట్టర్ యూజర్ పేరు ఎలీ (Aly).. తాజాగా ఐఫోన్, ఆండ్రాయిడ్‌ల ఫోన్లను పక్కపక్కన పెట్టి స్పీడ్ టెస్ట్ చేశాడు. ఆ రెండింటిలోనూ సేమ్ యాప్స్ ఓపెన్ చేస్తుంటే.. ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్స్ త్వరగా ఓపెన్ కాగా, ఐఫోన్‌లో మాత్రం చాలా లేట్‌గా ఓపెన్ అయ్యాయి. వెబ్‌సైట్లు, వైడ్ కెమెరా, నైట్ మోడ్ ఫీచర్లు కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే వేగంగా ఓపెన్ అయ్యాయి. అయితే ఈ టెస్టింగ్ వీడియో ఐఫోన్ యూజర్లను బాగా హర్ట్ చేసింది. దాంతో ఆండ్రాయిడ్ యూజర్లు, యాపిల్ ఐవోస్ యూజర్ల మధ్య వర్చువల్ వార్ జరుగుతోంది. ఎవరికి వారు తమ తమ బ్రాండ్ ఫోన్లే వేగంగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ స్పీడ్ టెస్ట్ వీడియోను 24 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.

తమ సాఫ్ట్‌వేర్ గొప్ప అంటే.. తమదే గొప్ప అంటూ.. నెటిజన్లు వాదులాడుకుంటున్నారు. ఐఫోన్‌ చాలా సెక్యూర్ ఫోన్ అని, ఇందులో వైరస్‌లు ప్రవేశించే చాన్స్ ఉండదని, అంతేకాదు హ్యాక్ చేయడం కూడా అంత ఈజీ కాదని, అదే ఆండ్రాయిడ్ ఫోన్లు తరుచూ వైరస్ బారిన పడతాయని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆండ్రాయిడ్ యూజర్లు.. ఐఫోన్‌లో కొత్త మోడల్ వచ్చినా సాఫ్ట్‌వేర్ మాత్రం పాతదే అని అంటున్నారు. ఇలా ఒకరి మాటలను, మరొకరు ఖండిస్తూ.. వర్చువల్ వార్‌కు తెర తీశారు.

అయితే ఫోన్లు తయారు చేసే కంపెనీలు బాగానే ఉన్నాయి. మధ్యలో మీరు మీరు దెబ్బలాడుకోవడం ఎందుకు? ఎవరి ఫోన్ వారికి గొప్పే! అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.



Next Story