గచ్చిబౌలి హౌసింగ్​ సొసైటీ భూమిపై ‘మై హోం’ కన్ను

298
Gatchibauli Housing Society

దిశ, తెలంగాణ బ్యూరో : వందల కోట్ల విలువైన భూమి చేతులు మారుతోంది. ఉద్యోగులకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. దాన్ని మైం హోంకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ భూమి తమకు అమ్మాలని, కొనుక్కునేందుకు సిద్ధంగా ఉన్నామని, అక్కడ భారీ నిర్మాణాలు చేస్తామంటూ సదరు సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకుంది. ఇప్పుడు అత్యంత విలువైన ప్రాంతంగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలోని ఈ భూమిపై ఇక ఉద్యోగులు ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏండ్ల నుంచి పోరాటం చేస్తూ.. కోట్లు ఖర్చు పెట్టినా భాగ్యనగర్​ఎన్జీఓలకు ఇండ్ల స్థలాలు రానట్టేనని తేలిపోయింది.

ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించారు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వేనంబరు 36, 37లోని 189.11 ఎకరాల భూమిని ప్రభుత్వం 2005లో ఏపీఎన్జీవోల హౌసింగ్‌ సొసైటీకి కేటాయించింది. అయితే ఈ భూముల్లోని దాదాపు 100 ఎకరాలు తమవేనంటూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకెక్కడంతో ఇక్కడ నిర్మాణాలు చేయలేదు. అయితే కొన్ని ప్లాట్లను కేటాయించుకున్నప్పటికీ నిర్మాణాలు సాగలేదు. వాస్తవానికి 1994లో ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీల కోసం గోపన్నపల్లి, గచ్చిబౌలిలోని 477 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇందులో 50 ఎకరాలు గచ్చిబౌలి రెవెన్యూ పరిధిలో ఉండగా, మిగతా భూమి గోపన్నపల్లి రెవెన్యూ పరిధిలో ఉంది. 2005 తరువాత ఈ భూములను ఏపీఎన్జీవో, టీఎన్జీవో హైకోర్టు ఉద్యోగుల సొసైటీ, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీలకు ప్రభుత్వం కేటాయించింది.

ఇందులో భాగంగా ఏపీఎన్జీవోలకు సర్వేనంబరు 36, 37లో గల 189.11 ఎకరాలను కేటాయించింది. 1994లో శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లి, గచ్చిబౌలిలోని సర్వే నం.36, 37ల్లో 477 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వం ఆయా సొసైటీలకు 427 ఎకరాలను కేటాయిస్తూ 2004లో జీవో జారీ చేసింది. ఏపీఎన్జీవో సొసైటీ మినహా మిగతా సంఘాలన్నీ ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిర్మాణాలు కూడా చేశారు. పలు కోర్టు వివాదాల కారణంగా ఏపీఎన్జీవోలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇప్పుడదే వారి కొంప ముంచింది.

రెండుసార్లు స్వాధీనం

ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూమిని రెవెన్యూ యంత్రాంగం రెండుసార్లు స్వాధీనం చేసుకుంది. 2005 భూమిని సొసైటీకి కేటాయించిన ప్రభుత్వం.. ఈ భూమిని నిరుపయోగంగా ఉంచడంతో 2007లో అక్టోబర్‌ 31న వెనక్కి తీసుకుంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతూ సొసైటీ సభ్యులు కోరారు. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్‌ చేశారు. ఈ విషయమై పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి సొసైటీ భూములను అప్పగించేందుకు నిర్ణయించడంతో సొసైటీ సభ్యులు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను విరమించుకున్నారు. దీంతో 2008లో సర్కార్‌ మళ్లీ ఈ సొసైటీకి భూమిని కేటాయించింది. ఆ తర్వాత ఈ భూములు అలాగే నిరుపయోగంగా ఉండడంతో, తెలంగాణ స్వరాష్ట్రంలో.. 2014, సెప్టెంబర్‌ 26న ప్రభుత్వం మరోసారి నోటీసు జారీ చేసింది. ఇలా ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూమిని రెవెన్యూ యంత్రాంగం రెండుసార్లు స్వాధీనం చేసుకుంది. ఇన్నేళ్లయినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదనే కారణంతో కేసీఆర్ సర్కారు వాపస్ తీసుకుంది.

నాకు కావాలి

రాష్ట్రంలో విలువైన భూములపై కన్నేసిన మై హోం సంస్థ.. ఇప్పుడు ఇక్కడ 90 ఎకరాలు కావాలంటూ సర్కారు దరఖాస్తు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. అయితే ఈ భూమిని మై హోం సంస్థకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్​ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్​ భేటీలో దీనిపై తీర్మానం చేయనున్నట్లు ఆయా వర్గాలు చెప్పుతున్నాయి. వాస్తవానికి ఆరు నెలల కిందటే ఈ భూమి కోసం సదరు సంస్థ లేఖ పెట్టగా.. కోర్టులో స్టేటస్​ కో మెయింటెన్​ అవుతుండటంతో ఆలస్యమవుతోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో ఇదే సాకుగా మార్కెట్​ ధర ప్రకారం అమ్మేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. టెండర్ల ద్వారా కాకుండా.. గంపగుత్తగా అదే సంస్థకు ఇచ్చేందుకు కేబినెట్​లో నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.

ఉద్యోగుల ఆశలు గల్లంతు

తెలంగాణ స్వరాష్ట్రం తర్వాత ఏపీ ఎన్జీఓ నుంచి బీటీఎన్జీఓగా ఆవిర్భవించింది. కేవలం ఇక్కడ ఇండ్ల కోసమే సభ్యత్వాలు తీసుకున్నారు. ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 5 లక్షల వరకు సభ్యత్వ రుసుం చెల్లించారు. భాగ్యనగర్​ తెలంగాణ నాన్​గెజిటెడ్​ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ భూమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దానిపై పెద్దల కన్ను పడటంతో.. ఇక ఉద్యోగుల ఆశలు గల్లంతైనట్లే.