కుటుంబ పాలనకు చరమ గీతం పాడండి : మురళీధర్ రావు

by  |
కుటుంబ పాలనకు చరమ గీతం పాడండి : మురళీధర్ రావు
X

దిశ, హుజురాబాద్ రూరల్ : తెలంగాణలో కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి మండలంలోని బోర్నపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు వినిపించకూడదని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దించి 5 నెలలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈటలను ఓడించడానికి కోట్లాది రూపాయలు వెదజల్లుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈటల పాత్ర మరువలేనిదని, ఉద్యమకారులను అకారణంగా పార్టీ నుంచి బయటకి పంపించడం కేసీఆర్‌కు తగదన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం బీజేపీ అభ్యర్థి ఈటలను గెలిపించి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కోరారు.

రాష్ట్రం ఎవరి జాగీర్ కాదు : ఈటల

రాష్ట్రం ఎవరి జాగీర్ కాదని, కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఈ నెల 30న చరమ గీతం పాడాలని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లను కోరారు. మద్యం, మనీతో మభ్యపెట్టాలని చూస్తున్న టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ గెలిచినా రైతు బంధు, పెన్షన్లు బంద్ కావని స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రజలు ఆత్మ గౌరవానికి తప్ప బెదిరింపులకు లొంగరని అన్నారు. చైతన్యవంతులైన నియోజకవర్గ ఓటర్లు ఎప్పటి లాగే ఆదరించి భారీ మెజార్టీతో తనను గెలిపిస్తారని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed