‘గ్రేటర్‌’కు కొత్త చట్టం

by  |
‘గ్రేటర్‌’కు కొత్త చట్టం
X

దిశ, న్యూస్‌బ్యూరో:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జీహెచ్ఎంసీ యాక్టుకు మార్పులు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో బల్దియా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పౌరులకు మరింత వేగవంతమైన సేవలు అందించడంతోపాటు అవినీతికి ఆస్కారంలేని పాలన అందించడమే లక్ష్యంగా కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిటీలోని అక్రమ కట్టడాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాలపై కఠినంగా వ్యవహరించేలా చట్టాన్ని రూపొందించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతోంది.
గ్రేటర్ పరిధిలో ఉన్న కోటికిపైగా జనాభాకు సేవలు అందించడంలో మరింత పారదర్శకత, మెరుగుదల సాధించడమే లక్ష్యంగా హైదరాబాద్ మున్సిపల్ యాక్టును రూపొందిస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. గతేడాది తెలంగాణ మున్సిపల్ యాక్టును మార్చిన ప్రభుత్వం ప్రస్తుతం హైదరాబాద్ మున్సిపల్ చట్టంపై దృష్టి సారించింది. హైదరాబాద్‌కు 1955 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. తర్వాతి కాలంలో అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఆ చట్టానికి మార్పులు చేసుకుంటూ వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించి ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఉన్న ప్రత్యేక చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో అవినీతిరహిత పాలన అందించడంతోపాటు అక్రమ నిర్మాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. గ్రేటర్ పరిధిలో ఎలాంటి ఆక్రమ నిర్మాణాలకు ఆస్కారం ఇవ్వకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలనే అలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని బల్దియా ఉన్నతాధికారుల అంతర్గత సమాచారం. నగరంలో విస్తరిస్తున్న నిర్మాణ రంగానికి అనుగుణంగా అనుమతులు కూడా సరళతరం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కొత్త మున్సిపల్ చట్టంలో గ్రీనరీ పెంపునకు ప్రాధాన్యతనిచ్చారు. హైదరాబాద్‌ పరిధిలో గ్రీనరీ పెంపు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. బల్దియా బడ్జెట్లోనూ గ్రీనరీ కోసం కొంత కేటాయింపులు ఉండనున్నట్టు తెలుస్తోంది. మురుగునీటి శుద్ధి, గేటేడ్ కమ్యూనిటీల్లో ఉత్పత్తి అయ్యే మురగును అక్కడే శుద్ధి చేసేవిధంగా ప్రత్యేక ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నగరంలో మురుగునీరు పెద్ద సమస్యగా మారి చెరువులు, కుంటలుసహా మూసీనది పూర్తిగా కలుషితం అయింది. నగరంలో ఉన్న చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని చట్టంలో కఠినమైన నిబంధనలు చేర్చాలని వివిధ వర్గాల ప్రజలు ప్రజలు కోరుతున్నారు.

పాలనలో వార్డు కమిటీలకు భాగస్వామ్యం కల్పించాలి – శ్రీనివాస్, సీపీఎం గ్రేటర్ నాయకులు

గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపడుతున్న పనులకు ప్రభుత్వం ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. రావాల్సిన వాటా ఇవ్వడం లేదు. ఇలాంటి వాటిపై చట్టంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నగరంలోని వార్డు కమిటీలను పాలనావ్యవస్థలో భాగస్వామ్యం చేయాలి. కొత్తం చట్టం రూపొందిస్తున్నపుడు డ్రాఫ్ట్ కాపీని విడుదల చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలను కోరడం ద్వారా పటిష్ట చట్టరూపకల్పన సాధ్యపడుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరముంది.

బల్దియాకు పటిష్టమైన చట్టం అవసరం – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

నగరంలో చెత్త సేకరణ, నిర్వహణ పెద్ద సమస్యగా మారిపోయింది. చెరువులు, ప్రభుత్వస్థలాలు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునేవారు కనిపించడం లేదు. అధికారులు, సామాజిక సంస్థలు కొంత స్పందించినా ఫలితం ఉండటం లేదు. వీటిని కాపాడేందుకు అవసరమైన పటిష్టమైన చట్టాలు రూపొందించాలి. అనుమతికి మించి నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీలోని మంచి అధికారులు ఉన్నా వ్యవస్థలోని లోపాల కారణంగా ఏమీ చేయలేకపోవడంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం తరఫున అధికారులకు బలాన్నిచ్చేలా చట్టాన్ని రూపకల్పన చేయాలి.

tags : Municipal, ACt, ghmc, Rules, good, cpm,

Next Story

Most Viewed