మంచం దగ్గరికే ‘సొల్యూషన్’.. ఫలించిన వృద్ధుడి వినూత్న నిరసన..!

by  |
మంచం దగ్గరికే ‘సొల్యూషన్’.. ఫలించిన వృద్ధుడి వినూత్న నిరసన..!
X

దిశ, మానకొండూరు : ఓ వృద్ధునికి చెందిన ప్రభుత్వ సీలింగ్ భూమిని ఒక కార్పొరేట్ కంపెనీ ఆక్రమించింది. దీంతో బాధితుడు గురువారం శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మంచంలోనే వృద్ధుడిని మండల కార్యాలయానికి కుటుంబ సభ్యులు తీసుకుని రాగా.. అక్కడే నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా బాధితుడు గాజుల మల్లయ్య, అతని ఫ్యామిలీ మాట్లాడుతూ.. శంకరపట్నం మండలం మక్త గ్రామానికి చెందిన దళితుడికి మక్త శివారు సర్వేనంబర్ 901లో 17 గంటలు, 879లో 13 గుంటలు, 889 లో 25 గుంటల భూమిని గత కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం తనకు అందజేసింది. అట్టి భూమిలోనే తన కుటుంబం సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. 901 సర్వే నంబర్లో గల తనకు చెందిన 17 గంటల భూమిని కార్పొరేట్ కంపెనీ గంగా కావేరి సీడ్స్ యజమానులు ఆక్రమించుకుని తనను వేధిస్తున్నారని, ఆ యజమానుల అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గురువారం పక్షవాతానికి గురైన వృద్ధుడిని మంచంపై పడుకోబెట్టుకుని గ్రామసర్పంచ్ నెలవేణి సుష్మా మహేష్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపారు.

వారంలో పరిష్కరిస్తా : ఎమ్మార్వో

గాజుల మల్లయ్య సమస్యను రెవెన్యూ శాఖ పరంగా, చట్టపరంగా పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇస్తుందని.. మల్లయ్య కుటుంబ సభ్యులకు వారం రోజుల్లోగా తగిన న్యాయం చేస్తానని తహసీల్దార్ గూడూరు శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నెలవేణి సుష్మా మహేష్, వెలుగునీడల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మోరె గణేష్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.

Next Story

Most Viewed