గొర్రెలు కాస్తున్న ప్రజా ప్రతినిధి.. ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు

by  |
MPTC Subbaiah Yadav
X

దిశ, వనపర్తి: అధికార కార్యక్రమాల్లో ఎంపీటీసీలకు సముచిత స్థానం, నమ్మకంతో గెలిపించిన ఓటర్లకు న్యాయం చేసే అవకాశం కల్పించాలని జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ కన్వీనర్ సుబ్బయ్య యాదవ్ కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీలకు అందిస్తున్న గౌరవ వేతనం రూ.5000 చాలకపోవడంతో భార్య పుస్తెలతాడు తాకట్టుపెట్టి కాంట్రాక్టు పనులు పూర్తి చేశామని తెలిపారు. వాటి బిల్లులు రాక ఎంపీటీసీ సుబ్బయ్య యాదవ్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఆర్థిక పరిస్థితిని అధిగమించేందుకు గ్రామంలోనే గొర్రెల కాపరిగా ఉపాధి పొందుతున్నారు.

వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం షాగాపూర్ ఎంపీటీసీ సభ్యులు సుబ్బయ్య యాదవ్ 20 ఏండ్ల పాటు సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 2019 ఎన్నికల్లో 419 ఓట్లతో ఎంపీటీసీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వికలాంగులకు వృద్ధులకు అనాథలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఎంపీటీసీగా బాధ్యతలు చేపట్టిన రెండేండ్ల ఏడు నెలల కాలంలో తన పరిధిలోని రైతులకు సాగునీరు అందించేందుకు భార్య పుస్తెలతాడు బ్యాంకులో తాకట్టు పెట్టి కాలువపనులు పూర్తి చేశాడు.

పనులు పూర్తిచేసి రోజులు గడుస్తున్నా బిల్లులు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక, చేసే పనులకు తీర్మాణాలు అడ్డంకులు రావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి తోడ్పాటు లేకపోవడంతో చేసేదేమీ లేక ఐదురోజుల పాటు గొర్ల కాపరిగా పనిచేసి ఉపాధి పొందుతున్నానని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలని సుబయ్య యాదన్ కోరారు.



Next Story