కలెక్టర్ ఆఫీస్‌కి అందుకే వస్తున్నామా.. మమ్మల్ని పట్టించుకోరా..!

by  |
కలెక్టర్ ఆఫీస్‌కి అందుకే వస్తున్నామా.. మమ్మల్ని పట్టించుకోరా..!
X

దిశ, కామారెడ్డి: ’ప్రతిసారి సమావేశానికి వచ్చినప్పుడల్లా చాయ్ ఇస్తున్నారు.. బిస్కెట్ తినిపిస్తున్నారు. వాటికోసమే మేము సమావేశానికి వస్తున్నట్టుగా ఉంది. పనుల గురించి అడిగితే సమాధానం బాగానే ఉన్నా.. పని చేయడం లేదు. మేము సమావేశానికి వచ్చినా రాకున్నా పెద్దగా తేడా ఏమి ఉండటం లేదు’ అంటూ విద్యుత్ శాఖ అధికారులపై ఆయా మండలాల ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శరత్ అధ్యక్షతన ఎంపీ బీబీపాటిల్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖల వారిగా సమీక్ష చేపట్టారు. విద్యుత్ శాఖ విషయానికి వచ్చేసరికి ప్రజాప్రతినిధులు అధికారులపై ఒంటికాలుపై లేచారు. తాము ప్రతి సమావేశంలో చెప్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

‘పల్లెప్రగతి కార్యక్రమంలో విద్యుత్ సమస్యలు తీర్చడంలో అధికారులు విఫలమయ్యారు. అసలే వర్షాకాలం. రైతులు సాగు చేసుకోవడానికి పొలాల వద్దకు వెళ్తున్నారు. చేయి పైకి లేపితే వైర్లు తాకుతున్నాయి. విరిగిన, వంగిన స్తంభాలు అలాగే ఉంటున్నాయి. వాటిని తొలగించడం లేదు. ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ప్రజలు ఎవరిని ప్రశ్నిస్తారు’ అంటూ అధికారులను నిలదీశారు. మీటింగులకు వస్తారు.. వెళ్ళిపోతారు.. అంతే అంతకంటే ఏం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని గ్రామాల్లో నిలదీస్తున్నారు. వారికి ఏమని సమాధానం చెప్పాలని ఎంపీపీలు ప్రశ్నించారు.

ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. పల్లె ప్రగతి కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు పనులు పూర్తవుతున్నాయన్నారు. అక్కడక్కడ కొన్ని పనులు మిగిలిపోతున్నాయని తెలిపారు. ప్రతిసారి సమావేశంలో ఇలాగే పునరావృతం అయితే బాగుండదని, ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారో వారికి నిర్దిష్టమైన తేదీ చెప్పాలని అధికారులకు సూచించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి రావద్దన్నారు. సంబంధిత అధికారులు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ హెచ్చరించారు.

Follow Dishadaily official Facebook Page : https://www.facebook.com/dishatelugunews

Next Story

Most Viewed