అసలు విషయం బయటపెట్టిన ఉత్తమ్.. త్వరలో కాంగ్రెస్‌లో..

214
Uttam-11

దిశ, చిలుకూరు: కాంగ్రెస్ లో కోవర్టులను ఉపేక్షించేది లేదని, వారిపై వేటు తప్పదని నల్గొండ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం చిలుకూరులో నిర్వహించిన పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 20 వరకు సభ్యత నమోదు పూర్తి చేయాలని, ప్రతి సభ్యునికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఉన్నా తనకు సొంత ఇల్లు లేదని, ప్రజా సంక్షేమానికే కట్టుబడి ఉన్నానని, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు టీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలతో ఇళ్లు నిర్మిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు కొల్లగొట్టిన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నయాపైసాతో సహా వసూలు చేస్తామని ఉత్తమ్ అన్నారు. కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ అధిక మెజార్టీతో గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు కీత వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ యడవల్లి పుల్లారావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు జి.నాగిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లు నాగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు సోందుమియా, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కోదాడ పట్టణ కార్యదర్శి వంగవీటి రామారావు, పీసీసీ కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి, సభ్యత నమోదు విభాగం జిల్లా భాద్యులు మంజులతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.